శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కేటీఆర్, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై అడుగు ముందుకు పడింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు మినహా బదిలీలు, పీఆర్‌సీ, రిటైర్‌మెంట్ వయసు పెంపు సహా 17 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఈటల రాజేందర్, కె.తారక రామారావు, జి.జగదీశ్వర్‌రెడ్డి చర్చించారు. అనంతరం 17 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కేబినెట్ సబ్ కమిటీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటారని స్పష్టం చేసింది.
సీపీఎస్ అంశాన్ని సైతం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సబ్ కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, సానుకూలంగా ఉన్నట్లు, అన్నింటిపై సీఎంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయులకు సంబంధించిన కీలకాంశాలపై శనివారం ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించనున్నట్లు కమిటీ వెల్లడించింది. అనంతరం అన్ని అంశాలను క్రోడీకరించి, శనివారం సాయంత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికను అందజేయనున్నట్లు తెలిపింది.
మేమంతా ఒకే కుటుంబం: ఈటల
ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘‘ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంది. భవిష్యత్‌లోనూ ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే కుటుంబంగా కలిసి పని చేస్తాం. ఉద్యమ సమయంలోనూ ఉద్యోగులతోనే కలిసి పని చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉద్యమకారులను వేరుగా చూడదు. గత నాలుగేళ్లలో ఉద్యోగుల సహకారంతోనే పథకాలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వానికి ఎదురైన అనేక అవరోధాలు, ఆటంకాలు, కుట్రలు, కుతంత్రాలను ఉద్యోగుల సహకారంతోనే ఎదుర్కొన్నాం. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురయ్యారు. వారి రెగ్యులరైజేషన్ న్యాయ వివాదాల్లో చిక్కుకున్నందున సమాన వేతనాలు ఇస్తున్నాం’’అని చెప్పారు.
సమావేశంలో ఉద్యోగులు 18 సమస్యలను చెప్పారని, వాటిన్నింటిని పరిశీలిస్తామని వివరించారు. టీచర్ల సమస్యలను కూడా తెలుసుకొని సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు. బదిలీలపై స్పందిస్తూ.. ప్రస్తుతం రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉన్నందునా ఈ నెలలో బదిలీలు చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో టీజీవో, టీఎన్‌జీవో నేతలతోపాటు జేఏసీ నేతలు, ఇంటర్ జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి, గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోలుకొండ సతీశ్, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పట్ల మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించడంతో టీఎన్‌జీవో నేతలు సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు.
పరిష్కరించేవేనని గుర్తించింది: కారెం రవీందర్‌రెడ్డి
సమావేశం అనంతరం టీఎన్‌జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ మాట్లాడారు. ‘‘మా సమస్యలు, డిమాండ్లను సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా ఇవేవీ పెద్ద సమస్యలు కాదని, పరిష్కరించగలిగేవే అన్న నిర్ధారణకు వచ్చారు. బదిలీలు చేసేందుకు, హెల్త్ స్కీం పక్కాగా అమలుకు, ఏపీలోని ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. నాలుగేళ్లుగా బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నాని చెప్పాం. ఆ బదిలీల ప్రక్రియను పది రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. జూన్ 2లోగా ఏపీలో ఉన్నవారిని తెలంగాణకు తీసుకురావాలని చెప్పాం. పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది జూలై 1 నాటికి అమల్లోకి తేలేకపోతే ఐఆర్ ప్రకటించాలని కోరాం’’అని చెప్పారు.
నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలన్నాం: మమత
సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. ‘‘సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. అవన్నీ సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు. రిటైర్‌మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరాం. గ్రంథాలయ, మార్కెటింగ్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరాం. హౌజింగ్, మార్కెటింగ్ శాఖల్లో తొలగించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నాం. నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలను పరిష్కరించాలని కోరాం. మంత్రుల కమిటీ కూడా శాశ్వతంగా ఉండాలని, దీంతో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించే అవకాశం ఉంటుందని చెప్పాం’’అని వివరించారు.
సీపీఎస్‌పై ప్రభుత్వం ఆలోచిస్తోంది: శ్రీనివాస్‌గౌడ్
సీపీఎస్ రద్దుపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు టీజీవో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇతర సమస్యల పట్ల కమిటీ సానుకూలంగా స్పందించిందని, పీఆర్‌సీ బకాయిల చెల్లింపు, హెల్త్‌కార్డుల వంటివెన్నో చేసిందని పేర్కొన్నారు. ఈ 18 అంశాల్లోనూ కొన్నింటిపై జీవోలు వచ్చినా, అధికారుల కారణంగా అమలుకు నోచుకోలేదన్నారు.
అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారం: దేవీప్రసాద్
అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని బ్రూవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, ఇది కాలయాపన చేసే కమిటీ కాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment