గద్వాల మండలం వెంకంపేటలో కల్లు గీస్తున్న గీత కార్మికుడు (ఫైల్)
గద్వాల : గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వీరికోసం హరితహారం కార్యక్రమం ద్వారా ఈత, తాటి, ఖర్బూజా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో నాటేందుకుగాను గీత కార్మికుల సంఘాలకు వీటిని అందిస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖకు ఏటా గీత కార్మికులు వివిధ రూపాల్లో పన్ను చెల్లిస్తున్నారు. ఇక ఎలాంటి పన్నులు చెల్లించకుండా తమ వృత్తిని కొనసాగించేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా జిల్లాలోని గద్వాల, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి, ఇటిక్యాల, రాజోళి, ధరూరు, వడ్డేపల్లి, అయిజ తదితర మండలాల్లో సుమారు 2,400మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కో సంఘంలో 20నుంచి 30 మంది వరకు సభ్యులు ఉన్నారు. అలాగే 68 వ్యక్తిగత లైసెన్సులు ఉన్నాయి.
ఏటా లైసెన్స్‌తోపాటు వివిధ రకాల పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.22,05,250 వసూలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ఎవరూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపాటికే హరితహారంలో భాగంగా గట్టు మండలం తప్పెట్లమెర్సులోని పదెకరాల్లో ఈత, ఖర్బూజ మొక్కలను నాటించింది. గీత కార్మికులు కల్లును గీసే క్రమంలో ప్రమాదం జరిగితే రూ.ఐదు లక్షల బీమా అందించనుంది. సంఘాల ద్వారా ప్రతి కార్మికుడికి రూ.రెండు లక్షల రుణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే 50ఏళ్లుపై బడిన వారికి పింఛన్ కింద నెలకు రూ.వేయి అందిస్తోంది. మరోవైపు కల్తీ సారా, గుడుంబా తయారీ చేయకుండా వివిధ రకాల వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి గౌరవప్రదమైన జీవితం కల్పించింది. దీంతో గౌడ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా భావించిన కొందరు విష రసాయనాలతో తయారుచేసిన కల్లును విక్రయిస్తూ గీత కార్మికులను పెడదోవ పట్టిస్తున్నారు. దీనిని నివారించేందుకుగాను ఈత, ఖర్బూజ మొక్కలను విరివిగా పెంచాలని ఆదేశించడం శుభసూచకం. దీంతో కొందరు పంట పొలాల మధ్య వీటికి సాగుకు ముందుకు వస్తున్నారు. పన్నుల నుంచి మినహాయించడం ఇవ్వడం ఉపశమనం.
– వెంకటేష్‌గౌడ్, గువ్వలదిన్నెతండా, కేటీదొడ్డి మండలం
కార్మికులకు మరింత భరోసా
గీత కార్మికులకు పలు వరాలు కురిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం శుభపరిణామం. గతంలోవలే సొసైటీలను తయారు చేసుకునే వీలు కల్పించడం, ఈత, తాటి చెట్లకు పన్ను రద్దు చేయడం సంతోషంగా ఉంది. ము ఖ్యంగా గీత కార్మికులకు పింఛను, బీమా పెంచడంతో ఆయా కుటుంబాలకు మరింత భరోసా లభించింది.
– పరమేష్‌గౌడ్, పెద్దధన్వాడ, రాజోళి మండలం
Comments
Please login to add a commentAdd a comment