సాక్షి, హైదరాబాద్: పచ్చదనం–పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పల్లె ప్రగతి రెండో విడతలోనూ దీనికే పెద్దపీట వేస్తోంది. సెప్టెంబర్‌లో 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పల్లెసీమలను ప్రగతిబాట పట్టించాలని భావిస్తోంది. ఈనెల 2నుంచి 12వ తేదీవరకు రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరుగనుంది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచే లా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. తొలి రోజు గ్రామ సభ నిర్వహించి.. మొదటి విడతలో చేపట్టిన పనులు, చేసిన చెల్లింపు వివరాలను ప్రజల ముందుంచనుంది. అలాగే సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, దాతల విరాళాల సమాచారాన్ని గ్రామస్తులకు చదివి వినిపించనుంది.
11 రోజులు పారిశుద్ధ్యం..
పల్లెప్రగతిలో భాగంగా 11 రోజులు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాలు, పిచ్చిచెట్లను తొలగించాలని నిర్దేశించింది. పాఠశాలలు, సంతలు, రోడ్లను క్లీన్‌గా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించింది. పచ్చదనం పెంపొందించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శాశ్వత నర్సరీని ఏర్పాటు చేయాలని, అటవీశాఖ అధికారుల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలని ఆదేశించింది.
గ్రామ బడ్జెట్‌లో పదిశాతం విధిగా పచ్చదనం పెంచడానికి కేటాయించాలని స్పష్టం చేసింది. పల్లెప్రగతిలో భాగంగా పవర్‌వీక్‌ను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిపోయిన విద్యుత్ పనులు పూర్తి చేయాలని, వేలాడుతున్న, వదులుగా ఉన్న కరెంటు తీగలు, స్తంభాలను సవరించాలని సూచించింది. గ్రామాల్లో తప్పనిసరిగా ఎల్‌ఈడీ బల్బులు వినియోగించేలా చూడాలని పేర్కొంది.
వార్షిక ప్రణాళిక తప్పనిసరి
2021 వార్షిక ప్రణాళిక రూపొందించి.. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని నిర్దేశించింది. అప్పులు, వేతనాలు, కరెంట్‌బిల్లుల చెల్లింపులను మదింపు చేయాలని, ఆస్తిపన్ను వసూలు, పన్ను పరిధిలోకి రాని ఇళ్లను గుర్తించడం, మొక్కలు నాటడం, స్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. నిధుల సమీకరణకు ప్రభుత్వ కేటాయింపులేగాకుండా.. సీఎస్‌ఆర్ నిధి, దాతల నుంచి విరాళాలు సేకరించాలని సూచించింది.
ప్రతి పల్లెకు ప్రత్యేకాధికారి
పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకు ప్రతి పంచాయతీకి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. వీరికి అదనంగా జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి. కాగా, ఈ సారి అఖిల భారత సర్వీసుల అధికారుల (ఏఐఎస్) సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను ప్రత్యేక అధికారులు (ఫ్లయింగ్ స్క్వాడ్)గా నియమించింది. 12 మండలాలకు ఒక అధికారిని నియమిస్తున్న ప్రభుత్వం.. సగటున రెండు పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించేలా రూట్‌మ్యాప్ తయారు చేసింది.
ఏయే మండలాలను కేటాయించారనే సమాచారాన్ని చివరి నిమిషంలో తెలియజేయనుంది. ఈ అధికారులు విధిగా పంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. అక్కడ జరుగుతున్న కార్యక్రమం తీరు, వైకుంఠధామం, శాశ్వత నర్సరీ, డంపింగ్ యార్డుల నిర్మాణం, నిర్వహణ ఇతర పనులను ప్రత్యక్షంగా పరిశీలించాల్సి వుంటుంది. అలాగే, తొలిదశలో గుర్తించిన పనులు, పనుల పురోగతి, ప్రస్తుతం చేపట్టిన పనులు, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, వార్షిక ప్రణాళిక అమలులో స్థానిక పాలకవర్గం పనితీరును మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో అలసత్వం వహించినట్టు తేలితే బాధ్యులైన అధికారులు, సర్పంచ్‌లపై చర్యలకు సిఫారసు చేసే అధికారాన్ని ఈ ప్రత్యేక బృందాలకు కట్టబెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment