* అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్
* అన్ని పార్టీలకు కబ్జా భూముల వివరాలు
* ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు
* 80 నుంచి 120 గజాల స్థలం ఉచితంగా క్రమబద్ధీకరణ
* పేదలకే క్రమబద్ధీకరించాలన్న వామపక్షాలు
* ‘ఓకే కామ్రేడ్స్.. విప్లవం వర్ధిల్లాలి’ అన్న కేసీఆర్
* పాతబస్తీలో మెట్రో మార్గంపై అన్ని పార్టీలతో చర్చ
* ప్రతిపాదిత మార్పులను మ్యాప్‌లతో వివరించిన ప్రభుత్వం
* హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు అఖిలపక్షం మద్దతు
* తుది కసరత్తు కోసం 16న మళ్లీ భేటీకి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో అన్యాక్రాంతమైన భూముల వివరాలను అన్ని పార్టీలకు రెండు రోజుల్లోగా అందిస్తామని, వాటిపై అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 16న మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. భూ కబ్జాలు, హుస్సేన్‌సాగర్ శుద్ధి, మెట్రో రైలు మార్గంలో మార్పులు తదితర అంశాలపై చర్చించేందుకు మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.
ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుతో పాటు కాంగ్రెస్ నుంచి కేఆర్ సురేష్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ, బీజేపీ తరఫున జి.కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, తమ్మినేని వీరభద్రం, సీపీఐ తరఫున రవీంద్రకుమార్, చాడ వెంకటరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన వారికి క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నాం. కబ్జాకుగురై ఖాళీగా ఉన్న భూముల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు పాల్పడకుండా పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం’ అని అఖిలపక్ష నేతలకు వివరించారు.
ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు 80 నుంచి 120 చదరపు గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించి, వారి పేరిట పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. గూడు లేని పేదల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ‘భారీ ఆక్రమణలను క్రమబద్ధీకరించొద్దు. పేదల ముసుగులో బడా భూకబ్జాదారులకు కొమ్ముకాయొద్దు. 120 గజాలకన్నా ఎక్కువగా క్రమబద్ధీకరించడాన్ని మేం అంగీకరించం’ అని వామపక్ష ప్రతినిధులు వ్యాఖ్యానించినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ.. ‘ఓకే కామ్రేడ్స్.. విప్లవం వర్ధిల్లాలి. పేదలకే క్రమబద్ధీకరిస్తాం. మిగిలిన విషయాలను 16న నిర్ణయిద్దాం’ అని అన్నారు.
మెట్రో మార్గంపై భిన్న వాదనలు
మెట్రో ప్రాజెక్టును పాత మార్గంలోనే పూర్తిచేయాలని బీజేపీ ప్రతినిధులు వాదించారు. అలా చేస్తే పాతబస్తీలో చాలా నష్టం జరుగుతుందని ఎంఐఎం అడ్డుచెప్పింది. ఇరు పార్టీల నేతలు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. చివరకు రైలు మార్గం విషయంలో పాతబస్తీ వాసులకు ఏది మంచిదో అదే చేద్దామనుకున్నారు. ఈ విషయంపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జోక్యం చేసుకుంటూ.. ‘మెట్రోరైల్ అలైన్‌మెంట్ మార్పువల్ల సమస్యలు వస్తున్నాయి. ఏదో గూడుపుఠాణి జరిగిందని ప్రభుత్వానికి అప్రదిష్ట వచ్చింది. కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వం వేధిస్తుందనే భావనతో ఇతర కంపెనీలు కూడా తెలంగాణకు రాకుండా పోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
అయితే దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. ‘ప్రభుత్వానికి అప్రదిష్ట అని ఎలా అంటారు? మెట్రోరైలుపై నాకు అవగాహన లేదా? ఇవన్నీ నాకు తెలియదని ఎలా అంటారు? ప్రపంచంలోనే ఇంతవేగంగా పనులు ఎక్కడా జరగడంలేదు. 28 కిలోమీటర్ల రైల్వే లైను కేవలం రెండేళ్లలో పూర్తయింది’ అని బదులిచ్చారు. హైదరాబాద్‌ను సింగపూర్‌గా మార్చాలని విపక్ష నేత ఒకరు సూచించినప్పుడు.. ‘హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. మరో సిటీతో పోల్చాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను హైదరాబాద్‌లాగే అభివద్ధి చేస్తా’మని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
చారిత్రక ప్రాంతాల పరిరక్షణ కోసమే
నగరంలోని చారిత్రక ప్రాంతాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చిహ్నాలు చెదిరిపోకుండా ఉండేలా మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకుపోనున్నట్లు అఖిలపక్ష నేతలకు సీఎం తెలిపారు. మూడు చోట్ల మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనుకవైపు నుంచి, సుల్తాన్‌బజారు నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కాలేజీ వెనుకవైపు నుంచి వెళ్లే విధంగా మార్పులు చేశామన్నారు. పాతబస్తీ మార్గంలో వచ్చిన అభ్యంతరాలను కూడా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను ప్రదర్శిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్‌వీఎన్ రెడ్డి అన్ని వివరాలను తెలియజేశారు. ఇక హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అఖిలపక్షానికి ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచంలో ఏ నగరానికి లేని గొప్ప అవకాశం హైదరాబాద్‌కు ఉన్నదని, నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ ఇప్పుడు మురికికూపంగా తయారవడం దురదృష్టకరమని అన్నారు. నాలాల నుంచి వచ్చే నీరు సాగర్‌లోకి చేరడం వల్ల కాలుష్యం పెరిగిపోయి మరీ ఇబ్బందిగా మారిపోయిందని కేసీఆర్ వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతిస్తామని అన్ని పార్టీల నేతలు చెప్పారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహార్మ్యాలు నిర్మించాలన్న ప్రతిపాదనకూ సమ్మతించారు.
అఖిలపక్షంపై పార్టీల స్పందన
మెట్రో రూటుపై ఏకాభిప్రాయం తేవాలి
మెట్రో పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. పాతబస్తీలో రూటు మార్పుపై ఎలాంటి సర్వేలు జరగలేదని ప్రభుత్వం తెలిపింది. మతపరమైన నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది క లగకూడదన్నదే మా అభిమతం. సుల్తాన్‌బజార్ రూటు మార్పుపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వమే కృషి చేయాలి. ఇక వినాయక్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై అన్ని సంఘాలు, మత పెద్దల అభిప్రాయం తీసుకోవాలి. సాధ్యాసాధ్యాలను కూడా తేల్చాలి. రాత్రికి రాత్రి నిర్ణయం మంచిది కాదు.
- కేఆర్ సురేష్‌రెడ్డి, భట్టి, కాంగ్రెస్
నిమజ్జన ప్రాంతాన్ని మార్చవద్దు
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. సాగర్‌లోనే ఓ పక్కగా ఘాట్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేసే చర్యలు తీసుకోండి. వినాయక్‌సాగర్ నిర్మాణంపై అక్కడి స్థానికుల నుంచి సైతం వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పాం. పాతబస్తీలో రూట్ మార్పు సైతం ప్రజలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉండాలి. దీనిపై సీఎం మొండిగా వ్యవహరించరాదు. నగరంలోని భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించేలా చట్టాన్ని తేవాలి. దీనికి మా సహకారం ఉంటుందని చెప్పాం.
- ఎర్రబెల్లి, రమణ, టీడీపీ
మెట్రో మార్గాన్ని మార్చొద్దు
ముందుగా ప్రతిపాదించిన మార్గంలోనే పాతబస్తీలో మెట్రో రైల్ నిర్మాణం జరగాలి. షాలిబండ, డబీర్‌పుర మార్గంలో మెట్రో వెళితే దాదాపు 10 లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మిగతా నగరంతో పాతబస్తీకి అనుసంధానం కలగాలంటే మొదట ప్రతిపాదించిన మార్గమే మేలు. సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలున్నందున అక్కడ అలైన్‌మెంట్ మారిస్తే అభ్యంతరం లేదు. ఇక ఎప్పటిలాగానే హుస్సేన్‌సాగర్ జలాశయంలోనే గణేష్ నిమజ్జనం జరగాలి.
- కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ
సరైన నిర్ణయం తీసుకోవాలి
హుస్సేన్ సాగర్ వద్ద పార్కింగ్, పరిశుభ్రత, రద్దీని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనంపై సరైన నిర్ణయం తీసుకోవాలి. పాతబస్తీలో మెట్రో మార్గంపై అసలు సర్వే కూడా చేపట్టనప్పుడు ఎన్ని నిర్మాణాలు తొలగించాలో ఎలా చెప్పగలరు? రైలు మార్గం ఎలా ఉండాలో పాతబస్తీ ప్రజలకే వదిలేయాలి.
- చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ
క్రమబద్ధీకరణతోకబ్జాదారులకు మేలు
క్రమబద్ధీకరణ ప్రతిపాదన కబ్జాదారులకు మేలు చేసేలా ఉంది. అన్యాక్రాంతమైన భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నగరంలో ఎక్కడిక్కడ నిమజ్జన కుంటలను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో ఉద్రేకాలు సృష్టించే ప్రయత్నం మంచిది కాదు. పాతబస్తీ ప్రజల కోరిక ప్రకారం మెట్రో నిర్మాణం జరగాలి.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం
హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేయాలి
1980కి ముందు హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన సంప్రదాయం లేదు. అందుకే నిమజ్జనాన్ని వికేంద్రీకరించి సాగర్‌ను పరిశుభ్రంగా ఉంచాలి. మెట్రో రైల్ మొదటి అలైన్‌మెంట్ ప్రకారం దాదాపు 1200 నిర్మాణాలు కూల్చేయాలి. ఇందులో 40కిపైగా మసీదులు, 20 మందిరాలు ఉన్నాయి. అలా కాకుండా మూసీ నది వెంట మార్గం నిర్మిస్తే కేవలం రెండు నిర్మాణాలు తొలగించాల్సి ఉంటుంది. మొదటి ప్రతిపాదిత మార్గంలో ఇప్పటికే ఎంఎంటీఎస్ ఉంది. అదే మార్గంలో మెట్రో వెళ్లడంలో అర్థం లేదు.
- అక్బరుద్దీన్, ఎంఐఎం
కబ్జాలపై కఠినం..
Published Wed, Dec 10 2014 1:27 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM
Advertisement
Advertisement