- ఎస్.ఆర్.నగర్-మియాపూర్ మెట్రో ప్రాజెక్టుపై సమాలోచన
హైదరాబాద్: ఎస్.ఆర్.నగర్-మియాపూర్(12 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్ల ప్రయోగ పరీక్షల నిర్వహణ, రైళ్ల రాకపోకలను అధికారికంగా ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై సీఎం కేసీఆర్‌తో ఎల్‌అండ్‌టీ సంస్థ చైర్మన్ ఏఎం నాయక్ మంగళవారం భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు కారిడార్ల పరిధిలో ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ట్రాఫిక్ అనుమతులు, అగ్నిమాపకశాఖ అనుమతుల మంజూరు వంటి విషయాల్లో ప్రభుత్వ పరంగా సహకారం అందజేస్తే ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం, జేబీఎస్-ఫలక్‌నుమా మార్గాల్లో మొత్తం 72 కి.మీ. మార్గంలో 2016 చివరినాటికి మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తిచేసే అవకాశం ఉంటుందని ఆయన సీఎంకు వివరించినట్లు సమాచారం.
మెట్రో కారిడార్లలో మరిన్ని ప్రభుత్వ స్థలాల లీజునిచ్చే అంశంతోపాటు వాణిజ్య ప్రకటనల పన్నులో కొంత మొత్తంలో రాయితీ ఇవ్వాలని సీఎంకు విన్నవించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ కింద నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, ఉప్పల్-ఘట్‌కేసర్, మియాపూర్-పటాన్‌చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తమకు అవకాశం ఇవ్వాలని నాయక్ సీఎంను కోరినట్లు తెలిసింది. ఈ భేటీ విషయమై ఎల్‌అండ్‌టీ వర్గాలను ‘సాక్షి’వివరణ కోరగా.. ఇది అధికారిక సమావేశం కాదని, సీఎం, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌లు కలసి భోజనం చేశారని ఇందులో ప్రత్యేకతలేవీ లేవని తెలపడం గమనార్హం.