తొలి మొక్కు ‘నీళ్ల’కే! | telangana government prefers water in budget | Sakshi
Sakshi News home page

తొలి మొక్కు ‘నీళ్ల’కే!

Published Thu, Nov 6 2014 2:29 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

తొలి మొక్కు ‘నీళ్ల’కే! - Sakshi

తొలి మొక్కు ‘నీళ్ల’కే!

 బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చిన టీ సర్కారు
 నీటిపారుదల, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట
 రాష్ర్ట తొలి బడ్జెట్‌లో సర్కారు ప్రాధాన్యం
 1,00,637 కోట్లతో భారీ బడ్జెట్

 
 సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల, చెరువులు, తాగునీటికే అధిక ప్రాధ్యాన్యమిస్తూ రాష్ర్ట తొలి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారీగా కేటాయింపులు, అంతకుమించిన అంచనాలతో బడ్జెట్ పరిమాణం రూ. లక్ష కోట్లు దాటింది. ఎన్నికల హామీలకు చోటు కల్పించడంతో పాటు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తూ నిధుల వరద పారించింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం భారీ అంచనాలతో రూ. 1,00,637.96 కోట్ల బడ్జెట్‌ను శాసనసభ ముందుంచారు. ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల కాలానికి మాత్రమే దీన్ని ప్రతిపాదించారు. మిగిలిన నాలుగు మాసాల  స్వల్ప కాలంలో సర్కారు ఎంత వ్యయం చేస్తుందన్న అంశాన్ని పక్కనపెడితే సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయంతో పాటు వాటర్‌గ్రిడ్ వంటి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్ రూపకల్పనలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ప్రతిబింబించేలా ఆర్థిక మంత్రి ప్రయత్నించారు.

ప్రణాళిక పద్దు కింద రూ. 48,648 కోట్లు, ప్రణాళికేతర పద్దు కింద రూ. 51,989 కోట్లను కేటాయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెడింటి మధ్య అంతరాన్ని బాగా తగ్గించడం చెప్పుకోదగ్గ విషయం. 17,398 కోట్ల మేర ద్రవ్యలోటును చూపినప్పటికీ.. 301 కోట్ల రెవెన్యూ మిగులును ప్రతిపాదించడం విశేషం. కానీ నికర మిగులు మాత్రం రూ. 5.5 కోట్లుగా ఉంది. అయితే బడ్జెట్‌లో చూపిన ఆదాయం అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఎక్కువగా కేంద్ర సాయం, రుణాల సమీకరణ, పన్నుల వాటా వంటి వనరులపైనే ప్రభుత్వం ఆధారపడింది. కాగా, రైతుల ఆత్మహత్యలకు తక్షణ ఉపశమనంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోయినా.. వ్యవసాయంతోపాటు విద్యుత్, నీటిపారుదల రంగాలకు అధిక కేటాయింపులు చేసింది. వీటికి ప్రణాళిక  పద్దులో భారీగా నిధులు ఇచ్చింది. నిజానికి ప్రణాళికా వ్యయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బడ్జెట్‌పై కసరత్తులో భాగంగా ఆర్థిక శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమై కేటాయింపుల్లో మార్పుచేర్పులు చేయించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రసంగం కూడా దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రస్తావిస్తూ సాగింది. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్న విషయాన్ని నొక్కి చెబుతూ ఈ పరిస్థితిని చక్కదిద్దమే తమ ప్రభుత్వం ముందున్న సవాల్ అని ఈటెల పేర్కొన్నారు. వ్యవసాయానికి ఊతమిచ్చేందుకు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ దీనికి అధిక ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించి 45 వేల చెరువుల పునరుద్ధరణకు సర్కారు నిర్ణయించింది. తొలివిడతగా ఈ ఆర్థిక సంవత్సరంలో 9,063 చె రువులను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఏకంగా రూ. 2 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసి.. యుద్ద ప్రతిపాదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ అంశాన్ని బడ్జెట్‌లో ప్రముఖంగా వివరించింది.
 
 సంక్షేమ పథకాలు, రహదారులకూ ప్రాధాన్యత
 
 ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందించేందుకు రూ. 25 వేల కోట్లతో ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం.. తన తొలి బడ్జెట్‌లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిచింది. అలాగే త్వరగా పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లోని నాలుగు ప్రాజెక్టులు, ఆదిలాబాద్‌లో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ప్రాణహిత-చేవేళ్ల ఎత్తిపోతల పథకానికి ఏకంగా రూ. 1790 కోట్లు ప్రతిపాదించడం విశేషం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పెన్షన్లకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్ పద్దుల్లో సర్కారు పొందుపరిచింది. కాగా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందుకోసం దాదాపు రూ. 200 కోట్లు కేటాయించింది. దీపం పథకం కింద 6.25 లక్షల మందికి కొత్తగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ. 100 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

వ్యవసాయ రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించినప్పటికీ.. ఈ పద్దుకిందే రూ. 4,250 కోట్ల రుణమాఫీ నిధులను బడ్జెట్‌లో చూపెట్టింది. అలాగే ఇటీవలే ప్రకటి ంచిన డ్రిప్, స్ప్రింక్లర్, పాలీహౌస్, వ్యవసాయ యాంత్రీకరణ వంటి కార్యక్రమాలకూ కేటాయింపులు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు భారీగా నిధులిచ్చారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణం పథకానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం లేకపోవడం గమనార్హం. దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. ఇక హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా, నిలోఫర్, గాంధీతోపాటు ప్రసూతి ఆసుప్రతుల్లో ఆధునిక యంత్రాల కొనుగోలుకు నిధులివ్వడం విశేషం. రహదారుల అభివృద్ధికి రూ. 4 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయాన్ని తెలంగాణలో ప్రముఖ ఆలయంగా అభివృద్ధి చేసేందుకు రూ. వంద కోట్లు ఇవ్వడంతోపాటు వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు మరో రూ. వంద కోట్లు కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement