సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 10–12 రోజుల్లో నివేదిక సమర్పిం చాలని వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత సీఎం స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి ఫిట్‌మెంట్ శాతంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల తొలి వారంలో ఈ సమా వేశం జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరితే అప్పటికప్పుడు ఫిట్‌మెంట్ శాతంపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 10వ పీఆర్సీ అమలు కాలపరిమితి 2018 జూన్ 31తో ముగియగా జూలై 1 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. సీఆర్ బిస్వాల్ చైర్మన్‌గా, ఉమామహేశ్వర్ రావు, మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా 2018 మేలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేయగా ఏడాదిన్నర గడిచినా ఇంకా నివేదిక సమర్పించలేదు.
ఉద్యోగుల వేతన సవరణతోపాటు సర్వీసు నిబంధ నల సరళీకరణ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పిం చాలని పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఆలస్యం కానుందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా ఉద్యో గులకు 2018 జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వెనక్కి తగ్గారు. నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటిస్తే కమిషన్‌ను అగౌరవ పరచినట్లు అవుతుందనే కారణాన్ని ఇందుకు చూపారు. మధ్యంతర భృతి ప్రకటన ఉండదని, నేరుగా వేతన సవరణ అమలు చేస్తామని ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యంపట్ల ఉద్యోగ సంఘాలు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం గత 37 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment