సాక్షి, హైదరాబాద్ : పాత రెవెన్యూ చట్టాలకు చెల్లు చీటి పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత చట్టాల స్థానే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 145 చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తోంది. ఇందుకనుగుణంగా ‘తెలంగాణ ల్యాండ్ రె వెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రస్తుతానికి చట్టం లేనట్లే?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించిన సీఎం..శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. అయితే రెవెన్యూ చట్టం ముసాయిదా తుది రూపునకు రాకపోవడంతో ప్రస్తుత సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టకపోవచ్చని తెలుస్తోంది. సీఎం.. సలహాలు, సూచనలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కలెక్టర్ల నుంచి ఎలాంటి నివేదికలు ప్రభుత్వానికి అందలేదు.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం...
బ్రిటిష్ కాలంలో భూమి శిస్తు వసూలు చేసేందుకు నియమించిన కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టర్ల విధుల నిర్వహణలో పెద్ద తేడా లేకున్నా హోదా, పేరును పునర్నిర్వచించాలని యోచిస్తోంది. ఇది కేవలం కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీవో, తహసీల్దార్లకు కూడా వర్తింపజేయాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే కిందిస్థాయిలోని వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇదివరకే సీఎం సంకేతాలిచ్చారు. ఈ వ్యవస్థను రద్దు చేయడమో లేదా ఇతర శాఖల్లో విలీనం చేయడం ద్వారానో క్షేత్రస్థాయిలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి తీరుపై వీఆర్వోలు ఇప్పటికే ఉద్యమబాట పట్టారు. మరోవైపు భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం లేకుండా శాశ్వత పరిష్కారం కలగజేస్తూ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించింది. అయితే ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని భావిస్తున్న సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేíషిస్తోంది. భూ సమగ్ర సర్వే, టైటిల్ గ్యారంటీని అమలు చేయడమా లేక తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టడమా అనే అంశాన్ని పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment