తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు 1.07లక్షలు
* ప్రాధాన్యత క్రమంలో నోటిఫికేషన్లు
* తొలి విడత 25 వేల పోస్టుల భర్తీ
* జూలై నుంచి మొదలు కానున్న ప్రక్రియ..
* డీఎస్సీ నిర్వహణకు రేషనలైజేషన్ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1.07 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా లెక్క తేల్చింది. కొన్ని విభాగాల్లో రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజన కొలిక్కి రావడంతో.. తాత్కాలిక కేటాయింపు జాబితాల ఆధారంగా ఈ ఖాళీల సంఖ్యపై నిర్ధారణకు వచ్చింది. సచివాలయం సహా మొత్తం 33 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో తొలివిడతగా 25 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఏఏ విభాగాల్లో, ఏఏ కేడర్‌లో ఖాళీలను భర్తీ చేయాలనే వివరాలపై కసరత్తు మొదలైంది.
ఇటీవలే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పంచాయతీరాజ్ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, పోలీసు కానిస్టేబుల్ (డైవర్లు) పోస్టులను అన్నింటికంటే ముందుగా భర్తీ చేసే అవకాశముంది. వీటితోపాటు ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులపై అత్యధిక ప్రాధాన్యం కనబరుస్తున్నందున ఆ శాఖలో ఇంజనీర్ల ఖాళీలను తొలి విడతలో భర్తీ చేసే యోచనలో ఉంది. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న 1,919 ఏఈలు, సబ్ ఇంజనీర్ల కొత్త పోస్టులకు జూలైలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
ప్రభుత్వం లెక్కతేల్చిన వాటిలో అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ, హోం శాఖ, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగాల్లో ఖాళీలున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 25 వేల పోస్టులు, హోంశాఖలో 15 వేలు, ఉన్నత విద్యాశాఖలో 10 వేలు, వైద్య ఆరోగ్య శాఖలో 11 వేలు, రెవెన్యూ విభాగంలో 10 వేలు, పంచాయతీరాజ్‌లో 7 వేలు, వ్యవసాయంలో 2,200 పోస్టులు, మిగతా విభాగాలన్నింటిలో 27 వేల ఖాళీలున్నాయి.
పాఠశాల విద్యాశాఖలో అత్యధికంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, డీఎస్సీ నిర్వహణకు పాఠశాలల రేషనలైజేషన్ అడ్డంగా ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకా రం రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. డీఎస్సీ నిర్వహించేలోగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ), పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్టే నియామకాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వీటితో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 పరిధిలో ఉన్న సంస్థల్లో ఉద్యోగుల విభజనకు చిక్కులు ఇంకా తొలగిపోనందున వీటిలోని ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని యోచిస్తోంది.