
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో అమలు చేయనున్న 24 గంటల జనతా కర్ఫ్యూ సందర్భంగా ఈ కింది చర్యలను తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
- 22న ఉదయం 6 గంటల నుంచి 23న ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలు అవుతుంది.
- జనతా కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని స్థానిక కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ ఎస్పీలు అప్పీల్ చేయాలి.
- వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసు తదితర అత్యవసర సేవల సిబ్బంది బయట తిరగడానికి అనుమతిస్తారు.
- అత్యవసర వైద్య సేవలకోసం పౌరులను బయటకు అనుమతిస్తారు. ఈ వ్యవధిలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవు.
- బయటి రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించకుండా రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు
- మందులు, నిత్యావసరాలు, ఆహార పదార్థాల రవాణాకు అనుమతిస్తారు. అన్ని మాల్స్, షాపులు మూసివేయాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సహకరించాలి.
- కోవిడ్–19కి వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్యులు, సిబ్బందికి సంఘీభావంగా 22న సాయంత్రం 5 గంటలకు సైరన్ మోగేలా కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ఎస్పీలు చర్యలు తీసుకోవాలి.
- ప్రతి 4 గంటలకోసారి పరిస్థితులపై కలెక్టర్లు నివేదిక పంపాలి.
కోవిడ్–19పై నిపుణుల కమిటీ
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్‌కుమార్
కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలతో పాటు చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ కె.రాకేశ్ మిశ్రా, కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి.గంగాధర్, హెచ్‌ఎంఆర్‌ఐ సీఈఓ బాలాజీ ఉట్ల ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.