సాక్షి, హైదరాబాద్: వైరస్ ఏదైనా.. దాన్ని కేరళ రాష్ట్రం ఇట్టే అరికడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల కేరళకు వెళ్లిన తెలంగాణకు చెందిన అధ్యయన బృందం సోమవారం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో.. ఇటీవలే కేరళలో 3 కేసులు నమోదై వారికి చికిత్స అందించిన విధానంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి 12 మంది సభ్యుల బృందం ఈ నెల 5న కేరళ వెళ్లింది. వైరస్ నియంత్రణ, సర్వైలెన్స్, నివారణ ప్రణాళికలపై కేరళ తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసి ఆదివారం రాత్రి రాష్ట్రానికి ఈ బృందం చేరుకుంది. సోమవారం సర్కారుకు నివేదికిచ్చింది. ఈ పర్యటనలో భాగంగా త్రివేండ్రంలోని డొమెస్టిక్, అంతర్జాతీయ టెర్మినల్‌లో స్క్రీనింగ్ విభాగాన్ని బృందం పరిశీలించింది. అలప్పుజా జిల్లాలో కోవిడ్ నియంత్రణపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడింది.
గ్రామస్థాయి నుంచే గుర్తింపు..
వైరస్ ఏదైనా దాన్ని గ్రామస్థాయి నుంచే గుర్తించాలని, పీహెచ్‌సీ పరిధిలో ఐడెంటిఫై చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి గ్రామాలకు విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే స్థానిక వైద్య సిబ్బంది వారిని గుర్తిస్తోంది. వారికి వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏవైనా వైరస్ అనుమానిత లక్షణాలుంటే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు పంపుతారు. నిపా వైరస్ తర్వాత కేరళ సర్కారు రాష్ట్ర రాజధానిలో కాకుండా ప్రతి జిల్లాల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దాంతో ఎక్కడికక్కడే వైరస్ అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచేవారు. విదేశాల నుంచి వచ్చి ఏమాత్రం కొంచెం అనారోగ్యానికి గురైనా వారిని ఇంటికే పరిమితం చేసేవారు. దీంతో వైరస్ ఎటువంటిదైనా దాన్ని ఇట్టే అరికట్టగలిగేది. అక్కడ ఎయిర్‌పోర్టులో ఎలా స్క్రీనింగ్ చేస్తున్నారో బృందం తెలుసుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లడం తదితర వివరాలన్నీ నివేదికలో పొందుపరిచారు.
అక్కడిలా చేశారు..
1. కోవిడ్ నియంత్రణకు కేరళ సర్కారు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది . సర్వైలెన్స్ టీమ్, కాల్‌సెంటర్ మేనేజ్‌మెంట్ టీమ్, ట్రైనింగ్ అండ్ అవెర్సెస్ జనరేషన్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మీడియా సర్వైలెన్స్, ఐఈసీ మీడియా మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, ప్రైవేటు çహాస్పిటల్స్ మేనేజ్‌మెంట్, ఎక్స్‌పర్ట్ స్టడీ కోఆర్డినేషన్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ అంబులెన్స్ మేనేజ్‌మెంట్, శాఖల మధ్య సహకారం, వలంటీర్ కోఆర్డినేషన్, సైకలాజికల్ సపోర్టు టీమ్‌లను ఏర్పాటు చేసింది.
2. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పారామెడికల్ సిబ్బంది, నాన్ పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్స్, అటెండర్స్, ఆశా వర్కర్స్, స్వయం సహాయక బృందాలు, లైన్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్, అంగన్‌వాడీలు, స్కూల్, కాలేజీ విద్యార్థులు, టెకీలు, హోటల్స్, రిసార్ట్ ఉద్యోగులందరికీ శిక్షణనిచ్చారు.
3. ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్న రోగికి, వారి కుటుంబసభ్యులకు మానసిక బలాన్నిచ్చేవారు.
4. మీడియా సర్వైలెన్స్ కమిటీ వైరస్‌పై, మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.
5. ఐసోలేషన్ కోసం సింగిల్ బెడ్రూమ్స్, సర్కారీ ఆస్పత్రుల్లో పెయిడ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కొన్ని ఐసోలేషన్ గదుల్లో వెంటిలేషన్, ఐసీయూ సౌకర్యాన్ని కల్పించారు.
6. ప్రతిరోజూ కోవిడ్‌పై సాయంత్రం 6 గంటలకు ఒక అధికార మీడియాతో మాట్లాడేలా ఏర్పాటుచేశారు. అలాగే బులిటెన్స్ విడుదల చేసేవారు.
7. ‘భయాన్ని తొలగించండి– జాగ్రత్త వహించండి’అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించారు.
యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో భాగస్వామ్యం..
రాష్ట్రంలో కోవిడ్ వైరస్‌పై ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు యూనిసెఫ్ ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు రాష్ట్రం లో సర్కారు చేపడుతున్న చర్యలపై పరిశీలిస్తున్నారు. యూనిసెఫ్ ప్రతినిధులు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ విషయాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment