దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం  | Telangana is the key to national development | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం 

Published Tue, Jul 30 2019 1:59 AM | Last Updated on Tue, Jul 30 2019 1:59 AM

Telangana is the key to national development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మానవ వనరులు మెండుగా ఉన్నాయని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం అవుతుందని అమెరికా ఎమోరి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జగదీశ్‌ ఎన్.. సేథ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘ఇండియా ఇన్  ది న్యూ వరల్డ్‌ ఆర్డర్, ఆపర్చునిటీస్‌ ఫర్‌ తెలంగాణ’నే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ సేథ్‌ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను భారత్‌లో ఏర్పాటు చేసుకోవడం అవసరమన్నారు. ప్రపంచీకరణలో భాగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దగ్గర ఉన్న ప్రాంతీయ వనరులను ఉపయోగించి అభివృద్ధి సాధించాలన్నారు. దేశంలో తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు, రకరకాల పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించేలా ఆన్ లైన్  విద్యను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

పేదవర్గాలు ఉన్నత స్థితికి ఎదిగేందుకు స్వచ్చంధ సంస్థలను వినియోగించుకోవాలని, వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. త్వరలో హైదరాబాద్‌ ఫార్మా, లైఫ్‌ సైన్స్, ఐటీ సెక్టార్లలో బెంగళూరును దాటేస్తుందని అభిప్రాయపడ్డారు. మల్టీ నేషనల్‌ కంపెనీలు రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ సెంటర్ల కోసం పెట్టుబడులు పెడుతున్నాయని, త్వరలోనే హైదరాబాద్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఆగస్టులో హాజరు మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్  టి.పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement