రైతు ఆత్మహత్యలపై రాహుల్‌వి మొసలి కన్నీళ్లు | telangana leaders fire on rahul gandhi | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై రాహుల్‌వి మొసలి కన్నీళ్లు

Published Sat, May 16 2015 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

telangana leaders fire on rahul gandhi

ప్రాణహిత డిజైన్ మార్చొద్దు: టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి
హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ విమర్శించింది. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో విదర్భ రైతుల ఆత్మహత్యలపై పార్లమెంటులో కన్నీళ్లు పెట్టుకున్న రాహుల్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏ ప్రయత్నం చే యలేదని ఆ పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడిరాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 11 నెలల టీఆర్‌ఎస్ పాలనలో వెయ్యిమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు.  

కనీసం కాంగ్రెస్‌వారికి కూడా భరోసా ఇవ్వలేదు
రాహుల్‌గాంధీ పర్యటనపై కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్: రైతుభరోసా యాత్ర పేరిట తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీసం కాంగ్రె స్ కార్యకర్తలకు కూడా భ రోసా కల్పించలేకపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు సాంబమూర్తి, వి.దినేష్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాగూరావు నామోజీలతో కలసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ప్రజాసమస్యలపై పోరాడుతానంటున్నా రాహుల్‌గాంధీ గత పదేళ్లు ఎక్కడ తొంగున్నారని ప్రశ్నించారు. మోదీ సూట్ గురించి అపరిపక్వతతో మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇక్కడకు వచ్చి భూమి బంగారం అని మాట్లాడుతున్న రాహుల్ మరి తన బావ వాద్రాకు ఇచ్చిన భూమి, గతంలో యూపీఏ ప్రభుత్వం సేకరించిన భూమి ఇనుమా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గజం కూడా సేకరించలేదన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.  

కాంగ్రెస్‌ది.. పాపాల చరిత్ర : గట్టు
హైదరాబాద్: కాంగ్రెస్‌ది పూర్తిగా పాపాల చరిత్ర అని, చేసిన పాపాలను కడిగేసుకునేందుకు చేపడుతున్న ఈ యాత్రకు ‘పశ్చాత్తాప యాత్ర’ అని పేరు పెట్టుకుంటే సరిపోయేదని టీఆర్‌ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఇది, రైతు భరోసా యాత్ర కాదని, ఫక్తు రాజకీయ, కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇవ్వాళే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ మాదిరిగా యాత్ర చేపడుతుంటే, రాహుల్ గాంధీ మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇవ్వలేదు, తాగడానికి నీరివ్వలేదు, ఎవరికీ ఏ సాయం చేయలేదు, కాబట్టే క్షమాపణ చెప్పడానికి వచ్చానని రాహుల్ అంటే కరెక్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

పరిహారం ఇచ్చి.. పాపాలను కడి గేసుకోలేరు
రాహుల్ పర్యటనపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్ : పదేళ్ల తమ పదవీ కాలంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి, వారి దుస్థితికి, ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించి తన పాపాలను కడిగేసుకోలేదని టీఆర్‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ నివారించలేకపోయిన రైతు ఆత్మహత్యలను.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పదినెల్ల కాలంలో చేయలేక పోయిందంటూ విమర్శించడం విడ్డూరమన్నారు.  రాహుల్‌ది కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement