
'ఆ ఘనకార్యాన్ని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసి తిరిగి చంద్రబాబు తెలంగాణ సర్కార్పై ఎదురుదాడికి దిగుతున్నారని వారు మండిపడ్డారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాము ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదని, ఆ అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరారవు అన్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని చంద్రబాబు దిగజార్చుతున్నారని, ఢిల్లీలో తెలుగు వారి పరువు తీశారని ఆయన విమర్శించారు. తమ చేష్టలతో బాబు తెలుగు జాతి గౌరవాన్ని, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చవద్దని తుమ్మల హితవు పలికారు. సెక్షన్ 8ని అడ్డు పెట్టుకుని బాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని తుమ్మల అన్నారు. తప్పు చేసేందే కాకుండా దబాయిస్తున్నారని, పైపెచ్చు తాను చేసిన ఘనకార్యాన్ని ప్రధాని వద్ద కూడా చెప్పుకోవటం సిగ్గుమాలిన పని అన్నారు. తనను అరెస్ట్ చేస్తే తెలంగాణ సర్కార్కు అదే ఆఖరు రోజు అన్న చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే...తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తామని చెప్పటమే అని, అది ఆయనకు సాధ్యపడుతుందా అని తుమ్మల ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు చాలా సిల్లీగా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీ పోలీసులను తెచ్చుకుంటామంటున్న ఆయన...నీళ్లు, కరెంట్ కూడా తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీయే కాదని, దేశంలో ఎక్కడకు తిరిగినా చంద్రబాబును ఎవరూ కాపాడలేరని తలసాని అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఇంకా గగ్గోలు పెట్టడం దుర్మార్గపు చర్చ అని తలసాని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విషయంలో సంబంధం లేదని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదని ఆయన సూటిగా ప్రవ్నించారు.