
అలాంటి దిక్కుమాలిన పని మేం చేయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగే...దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. శనివారం తలసాని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఒళ్లంతా విషమేనని, ఏపీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసేంత దరిద్రపు ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వానికి లేవన్నారు.
ట్విట్టర్ పిట్ట.. ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఛాంబర్లలో నిఘా కోసం మనుషులను పెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని తలసాని ఎద్దేవా చేశారు. అలాంటి నీచమైన ఆలోచన తమకు లేదన్నారు. టీడీపీలాగా దిక్కుమాలిన పని తాము చేయమని తలసాని అన్నారు.
చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసునని, రేవంత్ వ్యవహారంలో కళ్లముందు జరిగిన సంఘటనను పక్కదారి పట్టిస్తున్నారని, విచిత్రమైన వితండవాదం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తోందని తలసాని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఆయన అన్నారు.