'బాబు వ్యవహారంతో మంత్రులంతా బాధపడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారంతో ఏపీ ప్రజలకు సంబంధంలేదని తెలంగాణ రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల ప్రతిష్టను చంద్రబాబు మంట గలిపారని అక్కడి ప్రజలంతా బాధపడుతున్నారని చెప్పారు. సోమవారం తుమ్మల విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టలేక, రాజకీయంగా తెలంగాణలో జోక్యం చేసుకోవడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ మంత్రులు కూడా చంద్రబాబు తప్పు చేశాడని బాధపడుతున్నారని అన్నారు. అందుకే వాళ్లు మనస్పూర్తిగా మాట్లాడటంలేదనీ చెప్పారు. అయితే చంద్రబాబు ఫోన్ను ఎవరు ట్యాప్ చేయలేదని తుమ్మల స్పష్టం చేశారు. బ్రోకర్ చేసిన ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. ఆ కాల్ మాత్రమే రికార్డు చేసినట్టు తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు ఒప్పుకోవాలనీ.. ఈ వ్యవహారంతో తమకు కానీ, పార్టికి కానీ సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదంటూ తుమ్మల సూటిగా ప్రశ్నించారు.