- పనిచేసే నాయకులకే ఓట్లు వేయండి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే చేతగాని దద్దమ్మలు.. కనీసం గాడిదలు కాయడానికి కూడా పనికిరారు.. వారి నిర్లక్ష్యం వల్లే పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో సీపీఐ పోటీచేస్తున్న వార్డుల్లో శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేశారు. నెహ్రూ సెంటర్, పాతబజార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆర్‌యూబీ నిర్మాణం ఏళ్లతరబడి కొనసాగుతోంది.. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్ధతే కారణమని ధ్వజమెత్తారు. పట్టణ సమస్యలపై సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేసింది.. పనిచేసే నాయకులకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం పాలక మండలి ఏర్పడిన తరువాత ఆరు నెలల్లో తాగునీటి సమస్య, ఆర్‌యూబీ పూర్తి కాకుంటే దీక్ష చేపట్టి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు రవీందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు అడిగే ధైర్యం లేకే ప్రచారంలో పాల్గొనలేద న్నారు.
ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆర్‌యూ బీ నిర్మాణంతో వ్యాపారుల కుటుంబాలు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమ ని, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చే శారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ, మార్నేని వెంకన్న, అంజయ్య, శంకర్‌నాయక్, విశ్వేశ్వరరావు, రవి, విజయ్ సారథి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని భూస్థాపితం చేయూలి : నారాయణ
జనగామ, న్యూస్‌లైన్ : మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశంలో అరాచకాలకు అడ్రస్‌గా మారిన బీజేపీని భూస్థాపితం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన జనగామలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సినీహీరోలు పవన్‌కల్యాణ్, అక్కినేని నాగార్జున రాజకీయాలలోకి రావడం సంతోషకరమని, కానీ దేశ పరిస్థితులను వారు అర్థం చేసుకోకుండా మోడీ చెంతకు వెళ్లడం దురదృష్టకరమన్నారు.
పవన్‌కల్యాణ్ చెగువెరాను ఆదర్శంగా తీసుకుని.. అందుకు భిన్నవైన వ్యక్తిత్వం గల మోడీ దగ్గరకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. నాగార్జున తనకు ఉన్న భూసంపదను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీలో పురందేశ్వరి చేర డం అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వడాన్ని ఆయన ఆత్మహత్య సదృశ్యంగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నిక ల్లో సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంనర్సింహారావు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి పాల్గొన్నారు.