వలస ఓటర్ల కోసం వల | Net for the Voters | Sakshi
Sakshi News home page

వలస ఓటర్ల కోసం వల

Published Tue, Mar 25 2014 2:30 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

Net for the Voters

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:  
హలో బావా... ఎలాగున్నావ్రా.. సెల్లీ,పిల్లలు బాగున్నారట్రా...  ఏటీ లేదు కానీ... మన వార్డు ఎలచ్చన్లు ఈ నెల 30న జరుగుతున్నాయి బావా...  ఈ సారి నేనే పోటీ చేస్తున్నాను... నువ్వు.. సెల్లి వచ్చి ఓటేసి వెల్లండి బావా..!
 
హలో ... హలో... అన్నయ్య... బాగున్నావా... ఏంటి సంగతులు... పెద్దోడి పెళ్లి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి... మీకేటి అన్నయ్య  మంచి కోడలనే పట్టేశారు... ఏం లేదుకానీ... ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మన వార్డులో  నేను పోటీ చేస్తున్నా... నువ్వు, ఒదినా, పెళ్లి కొడుకు ఓటేయటానికి రావాలి...
 
ఇదీ ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థుల ఆత్రం. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తుండడంతో అభ్యర్థులు కూడా అందుకు తగినట్టుగా వలస ఓటర్లపై ప్రలోభాల వల విసురుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారికి ఫోన్ చేసి... ఊరొచ్చి ఓటేయమని వేడుకుంటున్నారు.
 
వలస ఓటర్ల కరుణ కోసం అన్ని వైపులా ప్రయత్నాలు ప్రారంభించారు. మహిళలకు కానుకలు, మగవారికి మనీ, మందూ సమర్పించుకుంటూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.
 
త్రిముఖ పోటీ అనివార్యమవడంతో ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్క ఓటును కూడా వదులుకోవడానికి సాహసించడంలేదు.  తమకు వారి ముఖాలు తెలియకపోయినా అక్కా, బావా అంటూ వరసలు కలుపుతూ ఫోన్లు చేస్తున్నారు. లేని ప్రేమలను ఒలకబోస్తున్నారు.
 
 దారిఖర్చులు తామే భరిస్తామని, వచ్చి వెళ్లిన సమయంలో నష్టపోయిన కూలీ డబ్బులకు అదనంగా మరింత సొమ్ము  ఇస్తామని, ఇక్కడ ఏ లోటూ లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తూ తమకు ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న.... దూరప్రాంతాకు వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా తమ అభ్యర్థనను విన్నవించుకుంటున్నారు.
 
విజయనగరం మున్సిపాలిటీ లో 40 వార్డుల్లో  లక్షా 76 వేల 931 మంది ఓటర్లు ఉండగా... ఆయా వార్డుల నుంచి 159 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 41 వేల మంది ఓటర్లు ఉండగా ఆయా వార్డుల నుంచి 117  మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 32,500 ఓటర్లు ఉండగా 95 మంది అభ్యర్థులు, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 33,796 ఓటర్లుండగా... 153 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు.  
 
అయితే నాలుగు మున్సిపాల్టీల పరిధిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉపాధి, ఉద్యోగావకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికలు రావటంతో బరిలో ఉన్న అభ్యర్థులు వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించి ఫోన్ చేయడంతో పాటు, నేరుగా అక్కడికి వెళ్లి మరీ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement