గిద్దలూరు, న్యూస్‌లైన్: నగర పంచాయతీ రిటర్నింగ్ అధికారి ఎస్‌ఎండీ అస్లాం ఎమ్మెల్యే వర్గానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వారి ఓటరు స్లిప్పులు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి దమ్మాల జనార్దన్, అతని భార్యకు చెందిన ఓటరు స్లిప్పులను ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు బలపరుస్తున్న బీఎస్పీ అభ్యర్థి పరుచూరి సుభాషిణికి అప్పగించారు. స్వయంగా రిటర్నింగ్ అధికారి, తహసీల్దారు సుధాకరరావు శనివారం రాత్రి ఆమె గృహంలో సోదాలు నిర్వహించగా 28 మంది ఓటరు స్లిప్పులు బయటపడ్డాయి.
అభ్యర్థి గృహంలో స్లిప్పులు దొరికినప్పటికీ, అవి ఎలా వచ్చాయో అభ్యర్థితోనే స్టేట్‌మెంట్ తీసుకోవాల్సిన అధికారులు, అలా కాకుండా వారి బంధువుల అమ్మాయి చేత స్టేట్‌మెంట్ రికార్డు చేయించారు. అభ్యర్థి సుభాషిణి ఎదురుగా ఉండగానే..ఆమె ఇంట్లో లేదని వేరే బాలిక చేత స్టేట్‌మెంట్ రికార్డు చేయడం గుర్తించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి దమ్మాల జనార్దన్ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్ సత్యం దృష్టికి తీసుకెళ్లారు. నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న సత్యం ఓటరు స్లిప్పులను, బాలిక చేత నమోదు చేయించిన స్టేట్‌మెంట్ రికార్డును పరిశీలించారు.
అభ్యర్థి ఇంట్లో ఉంటే, ఆమెతో కాకుండా బాలికతో స్టేట్‌మెంట్ ఎందుకు తీసుకున్నారని నగర పంచాయతీ రిటర్నింగ్ అధికారి అస్లాంపై మండిపడ్డారు. ఓటరు స్లిప్పులు ఒక అభ్యర్థి ఇంటికి ఎలా చేరాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మాల జనార్దన్, అతని భార్య భాగ్యలక్ష్మి ఓటరు స్లిప్పులు వారి ఇంట్లో ఉండటమేంటని ప్రశ్నించారు. తమ అభ్యర్థిని ఓటేయకుండా చేయడానికి, చనిపోయిన వారి ఓట్లు వేసుకునేందుకు ఇలా కుట్రపన్నారని అశోక్‌రెడ్డి మండిపడ్డారు. అధికారులు ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై విచారించి న్యాయం చేయాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సత్యంను కోరారు. ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, అవగాహనా రాహిత్యం వలనే ఇలా జరిగిందని సత్యం అన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ వద్ద ఉన్న 26 ఓటరు స్లిప్పుల్లోని ఓటర్లను విచారించి అవి సంబంధించిన వారికి ఇచ్చారా లేదా అని తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. 5వ వార్డులో అవకతవకలకు ఎక్కువగా పాల్పడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు.
దీనిపై మున్సిపల్ ఎన్నికల అధికారి అస్లాంను వివరణ కోరగా, బాలికతో స్టేట్‌మెంట్ రికార్డు చేసింది తాను కాదన్నారు. తహసీల్దారు సుధాకరరావు తీసుకున్నాడని, తనకు పూర్తిగా తెలియకనే ఇలా జరిగిందన్నారు. ఉద్యోగిగా ఉంటూ తాను ఒక పార్టీకి కొమ్ముకాయాల్సిన అవసరం లేదన్నారు.
ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఆర్‌వో
Published Sun, Mar 30 2014 3:27 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement