సాక్షి, హైదరాబాద్: పరిషత్ తొలిదశ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయిం చి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం ఉద యం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి.
ఆదివారం ఉదయం నుంచే ఎస్‌ఈసీ పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేరవేసింది. పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఇంక్, బ్యాలెట్ పత్రాలు, కవర్లు, బ్యాలెట్ బాక్స్‌లన్నీ సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, కార్యదర్శి ఆశోక్ కుమార్‌లు ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని పోలింగ్‌బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటుచేశారు. ఎస్‌ఈసీ ప్రధాన కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్‌ను ప్రత్యక్షంగా పరిశీలిం చేందుకు ఏర్పాట్లుచేశారు.
ఇవన్నీ నిషిద్ధం
బ్యాలెట్ పెట్టెలు, పత్రాలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నందున పార్టీల ఏజెంట్లతో సహా ఎవరూ కూడా పోలింగ్ బూత్‌లలోకి వాటర్‌బాటిళ్లు, అగ్గిపెట్టెలు, ఇంక్ బాటిళ్లు తదితరాలను తీసుకెళ్లరాదని ఎస్‌ఈసీ స్పష్టంచేసింది. పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లకు నీళ్లు, చాయ్ కూడా సరఫరా చేయరాదని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా సిబ్బంది కూడా టీ తదితరాలు తీసుకోకుండా ఉంటే మంచిదని సూచించింది. మారణాయుధాలను తీసుకువెళ్లకూడదని, పోలింగ్ బూత్ పరిసరాల్లో గుమిగూడి ఉండరాదని, వాహనాలను పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిలపాలని, చుట్ట, బీడీ, సిగరెట్ వంటి పొగాకు వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్ వంటి వాటిని కూడా పోలింగ్ బూత్‌ల్లోకి తీసుకవెళ్లరాదని స్పష్టం చేసింది. ఓటేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లను సరైన రీతిలో మడిచి బాక్స్‌ల్లో వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు పలు సూచనలు జారీ చేశారు. ఒకరి ఓటును మరోకరు వేశారని పోలింగ్ అధికారులు చెబితే.. మీ దగ్గరున్న ఆధారాలతో ఎన్నికల అధికారులను అడిగి టెండరు ఓటును అడిగి వేయవచ్చు. వికలాంగులు తమ వెంట ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లవచ్చు. అంధ ఓటర్లు పోలింగ్ అధికారుల సాయం తీసుకోవచ్చు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఈ ఎన్నికల సందర్భంగా ఓటేసిన వారికి ఎడమచేతి చూపుడు వేలికి ఇంక్ ముద్ర వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు వేస్తారు.
ఎంపీటీసీలకు పింక్ కలర్ బ్యాలెట్
రాష్ట్రంలో బ్యాలెట్ పద్ధతిన పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంపీటీసీ సభ్యులకు గులాబీ రంగు బ్యాలెట్, జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు కలర్ బ్యాలెట్‌ను ఖరారు చేశారు. పార్టీలకు కేటాయించే గుర్తులతో పాటు.. స్వతంత్రులకు 100 రకాల గుర్తులను ఖరారు చేశారు. పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా నామినేషన్లు ఫైనల్ కావడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. ఎంపీటీసీ అభ్యర్థికి గులాబీ రంగు, జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపరు ఇస్తారు. గుర్తుపై ముద్ర వేసిన తర్వాత పేపర్‌ను ఎడమ నుంచి కుడికి 3మడతలుగా చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన పెట్టెల్లో వేయాలి. పేపర్‌ను పైనుంచి కిందకు మడచవద్దు. పైనుంచి కిందకు మడిస్తే ఒక గుర్తుకు వేసిన ముద్ర మరో గుర్తుపై పడే అవకాశం ఉంటుంది. అలా రెండు గుర్తులపై ముద్ర పడితే చెల్లని ఓటుగా పరిగణిస్తారు.
నేడే పరిషత్ తొలి పోరు
Published Mon, May 6 2019 2:56 AM | Last Updated on Mon, May 6 2019 2:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment