
పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సాక్షి, హైదరాబాద్ : పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయించి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి.