కొమురం భీం వర్ధంతి సభలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఆ హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గిరిజన యోధుడు కొమురం భీం 74వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్రహం వద్ద నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో కొమురం భీం విగ్రహం వద్ద అర్ధగంట పాటు మౌన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, బలరాంనాయక్, రవీంద్రనాయక్, గిరిజన ఐక్య వేదిక అధ్యక్షుడు వి.వి.వినాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, టీఆర్‌ఎస్ నేతలు శ్యాంసుందర్ పాల్గొన్నారు.
టీటీడీపీ కార్యాలయంలో కొమురం భీం వర్ధంతి...
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొమురంభీం వర్ధంతి కార్యక్రమాన్ని ఆపార్టీ నేతలు నిర్వహించారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ నేతృత్వంలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, సీతక్క తదితరులు కొమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రవీంద్ర భారతిలో...
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి వేడుకలు బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ గిరిజన ఐక్యవేదిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ మృదుల సిన్హా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగు, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఐఏఎస్ అధికారి కె.నరసింహ పాల్గొన్నారు.