తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ బుధవారం జారీకానుంది. విద్యార్థులు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.
28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. మే 14న ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ బుధవారం జారీకానుంది. విద్యార్థులు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (http://www.tseamcet.in) దరఖాస్తు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణతోపాటు ఏపీకి చెందిన విద్యార్థులు కూడా ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 14న నిర్వహించే ఈ పరీక్ష ఫీజును రూ. 250గా ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ఇంజనీరింగ్, మెడికల్ రెండూ రాయాలనుకునే వారు రూ. 500 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య తేదీల్లో సవరించుకోవచ్చు.
రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 వరకు, రూ. 1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వ తేదీ వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే నెల 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. 16న కీ వెల్లడిస్తారు. 28న తుది ర్యాంకులను ప్రకటిస్తారు.