
ఓయూ స్థాయికి తెయూ ఎదగాలి
తెయూ(డిచ్‌పల్లి) : దేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, తెలం గాణ యూనివర్సిటీ ఆస్థాయికి చేరుకో వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆకాక్షించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన లా కళాశాల భవనం, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల భవనం, క్యాంపస్ ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే కేంద్రీయ గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
ఎన్నో త్యాగా ల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్రం సాధించుకోగానే సరిపోదని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం 24 గంటలు పనిచేసినా సరిపోదన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందించడం తెలంగాణ సీఎం కేసీఆర్ కల అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా పొరుగు రాష్ట్రం సీఎం చం ద్రబాబు ఇంకా కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు కరెం ట్ రాకుండా చేయడానికి బాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థ వివక్షకు గురైందన్నారు. ఆంధ్రా ప్రాంతంలో వర్సిటీలు అభివృద్ధికి నోచుకోగా, తెలంగాణలో యూనివర్సిటీలు సరైన వసతి సౌకర్యాలు, తగినన్ని నిధులు లేక సమస్యలకు నిలయంగా మారాయన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మూత్రశాలలు, తరగతి గదులు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తెయూలో అదనపు కోర్సులు, బాలికల వసతి గృహం, మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కోరిక మేరకు మిగిలిన జిల్లాల కన్నా ఈ జిల్లాకు అధిక నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీలో వీలైతే ఈ విద్యాసంవత్సరంలోనే బీటెక్ ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభించేందుకు కృషిచేస్తానని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 50 శాతం ఉద్యోగాలను తెలంగాణ విద్యార్థులు సాధించాలని పిలుపునిచ్చారు. బాసరలోని ట్రిపుల్ ఐటీకి చెందిన ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని, వారి ఉద్యోగాలు పోకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చారు.