కేసీఆర్ పిట్టల దొర: ఎర్రబెల్లి
హైదరాబాద్: హామీలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ పిట్టల దొరను మించిపోయారని టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. టీటీడీపీ శాసనసభా పక్షం కార్యాలయంలో శనివారం పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టిన నాటినుంచి కే సీఆర్ ఇప్పటి వరకు రూ.10 లక్షల కోట్ల విలువైన హామీలిచ్చారన్నారు. జిల్లా పర్యటనల్లో కేసీఆర్ ఇచ్చే హామీలకు అంతే లేకుండా పోతోందన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ సీఎం తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎడాపెడా ఇస్తున్న హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. ఇదిలాఉండగా, మంత్రి తలసాని రాజీనామా వ్యవహారంలో స్పీకర్, గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాజ్‌భవన్‌తో పాటు, స్పీకర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.