‘ఎర్రబెల్లి’కి ఎదురుదెబ్బలు! | TDP of the challenges to come in the DAYAKAR rao | Sakshi
Sakshi News home page

‘ఎర్రబెల్లి’కి ఎదురుదెబ్బలు!

Published Wed, Aug 12 2015 1:57 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

‘ఎర్రబెల్లి’కి ఎదురుదెబ్బలు! - Sakshi

‘ఎర్రబెల్లి’కి ఎదురుదెబ్బలు!

టీడీపీలో దయాకర్‌రావుకు సవాళ్లు
పార్టీకి దూరంగా సీనియర్లు
ద్వితీయ శ్రేణి నాయకుల  అసంతృప్తి
రోజురోజుకు  క్షీణిస్తున్న  ‘దేశం’

 
వరంగల్ : తెలుగుదేశం పార్టీలో రాష్ర్టస్థాయి లో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న దయాకర్‌రావుకు ఇప్పు డు పార్టీ సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ పరి స్థితి ఎదురవుతోంది. మరోవైపు ద్వితీ య శ్రేణి నేత ల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈనెల 2న వరంగల్‌లో జరిగిన టీడీపీ జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఇది స్పష్టమైంది. వికలాంగుల సంస్థ మాజీ డెరైక్టర్ కంప వినోద్‌కుమార్ పార్టీలోని పరిస్థితిని ప్రశ్నించడంతో వివాదం చోటు చేసుకుంది. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, వినోద్‌కుమార్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరికి ఎర్రబెల్లిపై కేసు నమోదు వరకు వెళ్లింది. ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ఇలా ఉండగా.. టీడీపీ కీలక నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి  ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై ‘దేశం’ శ్రేణుల్లో చర్చనీయాశంగా మారింది. ఇటీవల పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తితోనే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేదని తెలుస్తోంది. పార్టీ జిల్లా కమిటీ ఏర్పాటుపై ఎర్రబెల్లి దయాకర్‌రావు, గరికపాటి మోహన్‌రావు తీరుపై అసంతృప్తితోనే రేవూరి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

అంతా అసంతృప్తి
టీడీపీ తరుఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలవడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. దయాకర్‌రావు పార్టీ మారుతున్నారని బాగా ప్రచారం జరిగింది. టీడీపీలోనే కొనసాగుతానని దయాకర్‌రావు స్పష్టం చేయడంతో ఈ విషయం సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి ఎర్రబెల్లి తీరుపై టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం అవసరమైన మేరకు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రభావంతో జిల్లాలో టీడీపీ బాగా దెబ్బతిన్నది. సాధారణ ఎన్నికలకు ముందు పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి మారారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లోనూ తిరుగులేని హవా నడిపించిన దయాకర్‌రావుకు కొద్ది మంది నేతలు ఉన్న ప్రస్తుత సమయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. జిల్లాలో పార్టీని అభివృద్ధి చేసే అంశాలను పక్కనబెట్టి సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులకు బాధ్యతలు అప్పగించకుండా, జిల్లా కమిటీని ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారని అంటున్నారు.

అసలే తక్కువ మంది ఉన్న పార్టీలో కొనసాగుతున్న వారికీ ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏకైక ప్రజాప్రతినిధిగా, టీడీఎల్పీ నేతగా, రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు కారణంగానే పార్టీ సంస్థాగత అంశాల్లో స్తబ్దత నెలకొందని ద్వితీయ శ్రేణి నేతలు వాపోతున్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ పార్టీలో కొనసాగుతున్న వారిపై టీడీపీ జిల్లా ముఖ్యనాయకుల తీరు సరిగా ఉండడం లేదని వీరు అంటున్నారు. ఐదేళ్లుగా జిల్లాలో టీడీపీ బాగా క్షీణించింది. నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు లేని దుస్థితి నెలకొంది. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇది కొనసాగుతూనే ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement