సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వలస బాట పట్టిన నేతలను, కేడర్‌ను కాపాడుకునేందుకు ఇన్నాళ్లు బీజేపీతో పొత్తు ఉంటుందనే ఎత్తుగడ వేసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కొత్తరాగం ఆలపిస్తున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు పేరుతో ఎన్నికలకు వెళితే ఏ మాత్రం ఫలితం ఉండదని నిర్ధారణకొచ్చిన టీడీపీ నాయకులు, ఇప్పుడు ఒకడుగు ముందుకేసి ఏకంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ జపం చేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ రాథోడ్ రమేష్ నిర్వహిస్తున్న విలేకరుల సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పుకొస్తున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లోనే ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
సాధారణంగా ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ అధినేత సుపరిపాలన అందిస్తారని ప్రచారం చేసుకుంటారు. కానీ జిల్లాలో ఇందుకు భిన్నంగా టీడీపీ నేతల ప్రచారం సాగుతుండటం చర్చకు దారితీస్తోంది. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, విభజనకు తొందరెందుకంటూ.. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలతో జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతోంది. చంద్రబాబు పేరు చెబితే పడే ఓట్లు కూడా పడవని నిర్ధారణకు వచ్చే ఇప్పుడు టీడీపీ నేతలు నరేంద్రమోడీ జపం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ నేతల ‘నమో’ జపం చూసి బీజేపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నారు.
బల్దియా పోరుకు అభ్యర్థులు కరువు
అన్ని పార్టీల్లో మున్సిపల్ టిక్కెట్ల సందడి నెలకొంటే టీడీపీకి మాత్రం అభ్యర్థులు దొరకడం లేదు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు అభ్యర్థులు టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటే, టీడీపీ టిక్కెట్టు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతున్నారే తప్ప, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.
మరోవైపు ఆ పార్టీ నాయకత్వం రొజుకొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గోడం నగేష్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయలశంకర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భైంసాకు చెందిన రమాదేవి కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌తో పాటు, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లిల్లో టీడీపీ మాజీ కౌన్సిలర్లు రోజుకొకరిద్దరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తున్నారు. ఈ తరుణంలో నరేంద్రమోడీని జపం చేయడంతోనైనా కొంత మేరకు ఫలితం ఉంటుందని భావిస్తున్న టీడీపీ నాయకులు కొత్తరాగం ఆలపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘దేశం’ నేతల ‘నమో’ జపం
Published Fri, Mar 14 2014 12:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement