సాక్షి, హైదరాబాద్ : ఇలా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి అనే తేడా లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతవిద్య చదివించేందుకు పక్కరాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు పంపిస్తున్నారు. తమ పిల్లలు.. తమలా భవిష్యత్తులో ఇబ్బందులు పడొద్దన్న తపనతో మంచి చదువులకోసం ఆలోచిస్తున్న తల్లిదండ్రులకు పొరుగు రాష్ట్రాల్లోని కాలేజీలు ఊరిస్తున్నాయి. మన సంస్థలతో పోలిస్తే తక్కువ ఫీజులు ఉండడం, నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాల కారణంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న కాలేజీల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డొనేషన్ల కోసం ఎదురుచూస్తున్న మన టాప్ కాలేజీలతో పోలిస్తే ఆయా రాష్ట్రాల్లో ఫీజులు కూడా తక్కువగా ఉండడం ఇందుకు కారణం. డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగావకాశాలు, జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలున్నందున విద్యార్థులు కూడా ముందడుగేస్తున్నారు. రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు కూడా పొరుగు రాష్ట్రాలకు ఇంటర్మీడియట్ పూర్తయిన వారే ఎక్కువగా వెళ్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఇంటర్ బోర్డు నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్లు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం.
లోపాలు ఓ కారణమే!
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లోని లోపాలు కూడా మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టేందుకు ఓ కారణం అవుతోంది. అత్యధిక ఫీజులు, నాణ్యత ప్రమాణాల కొరత కూడా విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు వెళ్లేలా చేస్తున్నాయి. 20–30 టాప్ కాలేజీలు మినహా ఇతర విద్యా సంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువగా ఉంది. ఆర్టికల్ 371(డీ) ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మనదగ్గర ప్రవేశాలు కల్పించడం తక్కువే. అయితే గత పదేళ్లుగా నాణ్యత ప్రమాణాలు పెద్దగా పాటించని ఐదారు కాలేజీల్లో బిహార్, అస్సాం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. మిగులు సీట్లలో ప్రవేశాల పేరుతో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని ఆ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా సదరు విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇస్తుండటంతో యాజమాన్యాలే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ చేర్చుకుంటున్నారు.
ఇంజనీరింగ్ ఒక్కటే కాదు
ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్‌తోపాటు డిగ్రీ కోర్సులను చదువుకునేందుకు వెళ్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. బీబీఏ వంటి కోర్సుల కోసం కూడా బెంగళూరు, తమిళనాడు వంటి రాష్ట్రాల కాలేజీలను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డిగ్రీతోపాటు సివిల్స్ లక్ష్యమున్న వారి దృష్టంతా ఢిల్లీ కాలేజీలపై ఉంది. ముంబైలోని సెయింట్ జేవియర్ వంటి కాలేజీల్లో డిగ్రీ పూర్తి కాకముందే ఉద్యోగావకాశాలు వస్తుండటం కూడా మన విద్యార్థులు వలస వెళ్లేందుకు కారణమవుతోంది. దీనికితోడు ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుండటంతో విభిన్న రకాల సబ్జెక్టుల కలయికతో విద్యా సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో బీఎస్సీ (కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్) వంటి కోర్సులను అందుబాటులోకి తేవడం, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సులకు టాప్ వర్సిటీగా పేరు రావడంతో ఆవైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment