పగటి ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ కోతలతో గ్రేటర్‌వాసులను ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
గ్రేటర్‌లో రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం
అత్యధికంగా 46.7 మిలియన్ యూనిట్ల వాడకం
సాక్షి, హైదరాబాద్:
పగటి ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ కోతలతో గ్రేటర్‌వాసులను ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.రుతుపవనాలు చురుగ్గా లేకపోవడం, పొడి వాతావరణం, వేడిగాలులు వేసవిని తలపిస్తున్నాయి. బుధవారం గ్రేటర్‌లో 34.3 గరిష్ఠ, 24.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు న మోదయ్యాయి. ఫలితంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం మళ్లీ పెరిగింది. గత రెండు మాసాలతో పోలిస్తే మంగళవారం అత్యధికంగా 46.7 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కరెంట్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. గృహ వినియోగానికితోడు వ్యవసాయ వినియోగం రెట్టింపు కావడంతో లోటును పూడ్చేందుకు నగరంలో లైన్ల పునరుద్ధరణ పేరుతో కోతలు అమలు చేస్తున్నారు.
రెట్టింపైన గృహ వినియోగం..: గ్రేటర్‌లో 41 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా... వీటిలో 34 లక్షల గృహ, ఐదున్నర లక్షల వాణిజ్య, యాభై వేలకుపైగా పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల పగటి ఉష్ణోగ్రతలకు తోడు రోజంతా ఉక్కపోత ఉంటోంది. దీంతో గృహ విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. గత నెలలో రోజుకు సగటున 35–38 మిలియన్ యూనిట్లు ఉంటే, తాజాగా 47 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. పగటిపూట ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఒత్తిడికి తట్టుకోలేక పేలి పోతున్నాయి. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఇళ్లలోని విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు.