రాజయ్య పయనమెటు!
‘తాటికొండ’ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదుపరి పయనం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రాజయ్య.. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పదవికి దూరమయ్యారు. తెలంగాణలో బర్తరఫ్ అయిన మొదటి మంత్రిగా మిగిలారు. ఏడు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది.
రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవి పోవడం ఎలా ఉన్నా.. తన దీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి ఆ పదవి దక్కడం ఇబ్బందికరంగా మారింది. మంత్రి పదవి రావడం, పోవడం ఎలా ఉన్నా.. ఉన్నతమైన పదవి నుంచి తప్పించిన తీరుపై రాజయ్య అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజయ్య పయనం ఎలా ఉంటుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
ఇన్నాళ్లు ఉన్నతమైనన పదవిలో ఉన్న రాజయ్య ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా మారారు. 2019 ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా రాజయ్య ఎలా సర్దుకుంటానే అంశంపై టీఆర్‌ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి పదవి పోయిన నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు బహిరంగ వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎందుకిలా..
2009 సాధారణ ఎన్నికల్లో టి.రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడిగా మారారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు.
తెలంగాణ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని తాటికొండ రాజయ్య 2014 జూన్ 2వ తేదీన చేపట్టారు. వరంగల్‌లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖలో పలు ఆంశాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజయ్య వివరణతో ఈ అంశం సద్దుమణిగిందని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా భారీ మార్పులు జరిగాయి.