క్యాబినెట్ ‘కారు’ ఎక్కేదెవరు?
మహమూద్ అలీ, నాయినికి చాన్స్!
తనకూ అవకాశం ఇవ్వాలంటున్న పద్మారావు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఎవరికి దక్కనుంది? నగర నేతల్లో ఎంతమందికి చాన్స్ ఉంటుంది? ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలివి. ఇటు నేతలు, అటు కార్యకర్తల్లో ఈ అంశమే చర్చనీయాంశమైంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని నగరానికి ప్రాధాన్యమివ్వాల్సిందే.
ఈ నేపథ్యంలో నగర నేతలకు ముఖ్య బాధ్యతలు దక్కే అవకాశమే కనిపిస్తోంది. అందుకే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మొదటి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు నగర నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి సభ్యులు మహమూద్ అలీతో పాటు మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిలకు రాష్ట్ర క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తే శానసమండలి సభ్యులు మహమూద్ అలీ పేరును పరిశీలనకు తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా, కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ నాయిని నర్సింహారెడ్డికి సైతం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నాయిని నర్సింహారెడ్డి ప్రస్తుతం శాసనసభ - శాసనమండలిలో దేనిలో సభ్యులు కాకపోవటంతో ఆయన పదవిపై ఒకింత చర్చ జరుగుతోంది. ముందు క్యాబినెట్‌లోకి తీసుకుని తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన వారిలో పద్మారావు (సికింద్రాబాద్), కనకారెడ్డి (మల్కాజిగిరి) గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు)లు మాత్రమే విజయం సాధించారు.
అయితే వీరిలో కనకారెడ్డి, మహిపాల్‌రెడ్డిలు తొలిసారిగా విజయం సాధించగా.. పద్మారావు రెండవ మారు శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ఈయనకు రెండు మార్లు కార్పొరేటర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పద్మారావుకు క్యాబినెట్ బెర్త్ ఖాయమనే భావనను పార్టీ ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ నివాసం కిటకిట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్ నివాసం నా యకులు, కార్యకర్తలు, జనంతో కిటకిట లాడుతోంది. రోజంతా వేలాదిగా తరలివస్తున్న సందర్శకులతో బంజారాహిల్స్‌లోని నందీనగర్ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.