సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అంశం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జిల్లాలో రెండు వర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవి ఎంపిక విషయంలో ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం కష్టంగా మారింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ గురువారం ఏఐసీసీ ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అనుకూల వర్గంగా పేరున్న భార్గవ్‌కు డీసీసీ పగ్గాలు అప్పగించడం పట్ల జిల్లాలోని సీఎల్పీ నేత జానారెడ్డి వర్గం నేతలకు ఏమాత్రం మింగుడు పడటంలేదు.
గతంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకత్వం రెండు వర్గాలుగా విడిపోయింది. టీపీసీసీ అధ్యక్ష పదవిని జానారెడ్డికి ఇవ్వాలని ఒకవర్గం నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. కానీ అధిష్టానం పొన్నాల లక్ష్మయ్య ను ఈ పదవికి ఎంపిక చేసి నియమించింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో పొన్నాల వర్గంగా ముద్రపడిన నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. జానారెడ్డి వర్గీయులకు ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి మొండిచేయి దక్కిందనే వాదన వినిపించింది. తాజాగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం చర్చకు దారితీసింది.
మరోమారు రచ్చకెక్కిన వర్గపోరు..
ఆ పార్టీలోని వర్గ విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. అధిష్టానం నిర్ణయంపై ఒకవర్గం భగ్గుమంటోంది. కొం దరు నేతలు ఏకంగా రాజీనామాకు సైతం సిద్ధమంటూ ప్రకటించారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటారని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అనుభవం కలిగిన నాయకులను ఆ పదవిలో నియమించాలని మరికొం దరు పేర్కొంటున్నారు. భార్గవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడం ఒకవర్గం స్వాగతిస్తోంది. భార్గవ్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం యువతకు పార్టీలో పెద్దపీట వేసినట్లు అవుతుందని ఆయన అనుకూల వర్గం వాదిస్తోంది.
ఇప్పుడు డీసీసీ విషయంలో కరువ మంటే కప్పకు కోపం విడువ మంటే పాముకు కోపం అన్న చందంగా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 24న రంగారెడ్డి జిల్లాలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సదస్సు ఉన్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో అనిశ్చితి నెలకొం దనే అభిప్రాయం పార్టీలోని ఒక వర్గం నుంచి వ్యక్తమవుతోంది. సదస్సు తర్వాతే ఈ అనిశ్చితికి తెరపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
డీసీసీపై ఏకాభిప్రాయం కష్టమే
Published Sun, Aug 24 2014 12:13 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement