మనిషి ప్రాణానికి విలువేది..!
► ప్రమాదంపై స్పందించని యాజమాన్యం
► మృతదేహంతో ఎన్టీపీసీ గేట్ వద్ద నిరసన
జ్యోతినగర్: ముప్పై ఏళ్లకుపైగా సంస్థలో పనిచేస్తున్న ఓ కార్మికుడు విధినిర్వహణలో జరిగిన ప్రమాదంలో మరణిస్తే యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఎన్టీపీసీ రామగుండం సంస్థలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న తోపుచెర్ల సంపత్‌రావు(55) మంగళవారం ఉదయం విధి నిర్వహణలో గాయపడ్డాడు. తోటి కార్మికులు పీటీఎస్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగానే చనిపోయాడు. మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని ప్రాజెక్టు గేట్ వద్ద ఉంచి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
బుధవారం సాయంత్రం కావస్తున్నా ఆకుటుంబానికి నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేయడంపై కార్మికులు యాజమాన్య వైఖరిపై మండిపడుతున్నారు. గేట్ వద్ద ఉంచిన మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోధించినా యాజమాన్యానికి కనిపించడం లేదా అని తోటి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుని ప్రాణానికి భద్రత కరువైందనడానికి ఇదే నిదర్శనమని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ వారి ప్రాణాల భద్రతకు మాత్రం సంబంధిత యాజమాన్యం ఎలాంటి రక్షణ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాలు ఫలించకపోవడంతోనే కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి. కార్మికులు విధులు సైతం బహిష్కరించి నిరసన చేస్తున్నప్పటికి చలనం లేకపోవడంతో గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్టీపీసీ సంస్థలోని కాంట్రాక్టు కార్మికుల భద్రతపై అన్ని యూనియన్లు కలిసికట్టుగా ఉద్యమం చేసి వారి హక్కులు సాధిస్తేనే జీవన మనుగడకు అర్థం ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు.