ఓరుగల్లు కీర్తితోరణం
ఓరుగల్లు ఘనమైన వారసత్వ సంపదకు ఇంతకాలం గుర్తుగా ఉన్న కాకతీయుల శిలాతోరణం ఇకపై ప్రభుత్వ అధికారిక చిహ్నంగా మారనుంది. కాకతీయులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కీర్తితోరణం. వరంగల్, తెలంగాణ, తెలుగు ప్రజలను సింబాలిక్‌గా చూపించేందుకు కాకతీయుల కీర్తి తోరణాన్ని మించిన చిహ్నం మరొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారచిహ్నంపై టీఆర్‌ఎస్ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఎట్టకేలకు కాకతీయుల కీర్తితోరణం, చార్మినార్, నాలుగు సింహాల కలయికతో రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండేలా లోగోను డిజైన్ చేసింది.
సాక్షి, హన్మకొండ : హస్తకళలకు పెట్టింది పేరైన జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ఐలాచారి కాకతీయుల కీర్తితోరణానికి ప్రచారం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 1973లో వరంగల్ ఇండస్ట్రియల్ ఏరి యాలో కొత్తగా ఆపే ట్రాక్టర్ షోరూంను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకుడు ఆహూతులకు ఇచ్చేందుకు ఏదైనా జ్ఞాపికను తయారుచేయమని పెంబర్తి కళాకారుడు ఐలాచారిని కోరగా... కాకతీయ కీర్తితోరణం మధ్యలో ఆపే ట్రాక్టర్ ఉండేలా ఓ జ్ఞాపికను తయారు చేశారు. షోరూం ఫంక్షన్‌లో ఆ జ్ఞాపిక హైలెట్‌గా నిలిచింది. అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ జ్ఞాపికపై ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
ప్రపంచ కీర్తికి నాంది
1974లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించి లోగోను రూపొందించాల్సిందిగా కళాకారులను కోరింది. దీంతో గతంలో పేరు తెచ్చిన కాకతీయ కీర్తితోరణం ప్రధానంగా డిజైన్ రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు ఈ డిజైన్ చూసి ముగ్ధుడై ఆ సభలో బహూకరించేందుకు 200 జ్ఞాపికలు కావాలంటూ అక్కడికక్కడే ఆర్డరు ఇచ్చారు. ఒక్కో జ్ఞాపిక తయారీకి రూ.180 కోట్ చేస్తూ ఐలాచారి టెండర్ వేశారు. ఈ కళాఖండానికి రూ.180 అంటే తక్కువ అని... రూ.200గా కోట్ చేయమని వెంగళరావు ప్రత్యేకంగా సూచించారు. అంతేకాదు... అదనంగా మరో 300 జ్ఞాపికలు తయారు చేయాలని పురమాయించారు. అలా మొదటిసారిగా కాకతీయుల కీర్తి తోరణం ప్రపంచ వేదికలపై సగర్వంగా దర్శనం ఇచ్చింది.
అన్నింటా తానే...
ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసిన మూడు నెలలకు స్వయంగా ముఖ్యమంత్రి వెంగళరావు పెంబర్తిని దర్శించారు. ఈ నేపథ్యంలో కీర్తితోరణం డిజైన్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. అప్పటినుంచి వందల ఫంక్షన్లలో వేలాదిగా జ్ఞాపికలు పంచారు. ఆ తర్వాత నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులకు మెడల్స్ తయారు చేసే పని పెంబర్తి కళాకారులకు అప్పగించారు. గోల్కొండ, చార్మినార్‌లతో కూడిన వివిధ డిజైన్లు ఆయనకు నచ్చలేదు. చివరకు కాకతీయ కీర్తితోరణంతో డిజైన్ తయారు చేయగా... వెంటనే ఆయన ఒప్పుకున్నారు.
ఇప్పటికీ ఆ డిజైన్‌తోనే పోలీసులకు మెడళ్లు ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ యూనివర్సిటీ, కలెక్టరేట్, జిల్లా సరిహద్దులు ఇలా అంతటా కీర్తితోరణాలు నిర్మించారు. ఇలా అన్ని ప్రముఖ స్థలాల ముందు టీవిగా నిలబడి అందరికీ స్వాగతం పలికిన కీర్తి తోరణం ఇకపై తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలో భాగం కానుంది.