‘కల్వకుర్తి’ మూడోదశ పూర్తయ్యేదెప్పుడు?
- ఆరు నెలలుగా ఆగిన పనులు
- పనుల గడువును ఏడాది పొడిగించినా మారని కాంట్రాక్టు సంస్థ తీరు
- వచ్చే జూన్‌లోగా ప్రాజెక్టు పూర్తికావడం అనుమానమే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన మహబూబ్‌నగర్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో 3.4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సాగునీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
వివిధ కారణాలను చూపుతూ కాంట్రాక్టు సంస్థ ఆరు నెలలకు పైగా పనులను పూర్తిగా నిలిపివేసి చోద్యం చూస్తోంది. పనులు పూర్తి చేసేందుకు గతంలో విధించిన గడువు ఈ ఏడాది జూన్‌తోనే ముగిసినా, పనుల చివరి దశలో ఇతర కాంట్రాక్టు సంస్థకు ఇవ్వటం ఇష్టం లేక ప్రభుత్వం పాత సంస్థకే మరో ఏడాది గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మూడు దశలుగా ప్రాజెక్టు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 3.40లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా, ప్రాజెక్టు మొత్తాన్ని మూడు దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ ఒకటో దశ కింద 13వేల ఎకరాలు, జొన్నలబొగడ రెండో దశ కింద 47వేల ఎకరాలు, మూడో దశ గుడిపల్లెగట్టు కింద 2.80లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందులో మూడో దశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్‌లను నిర్మించేందుకు 2005-06లో గ్యామన్ ఇండియా అనే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు.
13 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు పంపులు 800ల క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకి పంప్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన గ్యామన్ ఇండియా 2010లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు గడువును పొడిగించింది. ఈ ఏడాది మే వరకు ఆ సంస్థ 82 శాతం పనులను పూర్తి చేసింది. అయితే జూన్ మొదటివారం నుంచి పనులను పూర్తిగా నిలిపివేసింది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యానే కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
గడువు పొడిగించినా కదలని పనులు..
కాగా ప్రాజెక్టు పనులకు సంబంధించి ఈ ఏడాది జూన్‌తో గడువు ముగియగా సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోమారు గడువును ఏడాది పాటు పొడిగించింది. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మధ్యలో నిలిచిపోయిన సుమారు రూ.110కోట్ల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరందించాలని ఆదేశించింది. అయితే గడువు పొడిగించి రెండు నెలలు గడుస్తున్నా అడుగు ముందుకు కదల్లేదు. దీనిపై స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడినా ఫలితం కానరావడం లేదు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.