
పరిమితం....సతమతం!
- ప్రణాళికల్లో 50 ప్రతిపాదనలకే పరిమితం
- పంచాయతీలో మూడు, మండలంలో పది పనులు
- జెడ్పీలో మండలానికి ఒకటి చొప్పున అవకాశం
- ఇప్పటికే రూ.18 వేల కోట్లకు చేరిన అంచనాలు
- కుదించిన పనులతో మల్లగుల్లాలు పడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్, అధికారులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ప్రణాళికల్లో పొందుపరిచే ప్రతిపాదనల విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. జిల్లా స్థాయి ప్రణాళికలో చేర్చే అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ప్రభుత్వం 50కి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీచేయడమే ఇందుకు కారణం. జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన 50 మంది జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చే ఒక్కో ప్రతిపాదనతోనే జిల్లాకు కేటాయించే కోటా పూర్తవుతుంది. ఇది వారికి చిక్కులు తెచ్చిపెట్టగా... పనుల ప్రతిపాదనలను పరిమితం చేయడం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చాన్స్ లేకుండా పోయింది.
గ్రామానికి మూడు పనులు...
జిల్లాల సమగ్రాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించింది. అదేవిధంగా జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి పనుల ప్రతిపాదనలు సేకరించింది. ఈ మేరకు కుప్పలు తెప్పలుగా సిఫార్సులు వచ్చిపడ్డాయి. అభివృద్ధి పనుల అంచనా వ్యయం రూ.18 వేల కోట్లకు చేరింది. ఈ క్రమంలో ప్రణాళికల ప్రతిపాదనల్లో పరిమితి విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా... రాష్ట్ర గ్రామీణాభి వృద్ధిశాఖ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సూచనలు అందాయి.
ఇందుకనుగుణంగా మన ఊరు-మన ప్రణాళికల్లో ప్రతి ఆవాస ప్రాంతానికి మూడు పనులు... మన మండలం-మన ప్రణాళికలో పది పనులను మాత్రమే ప్రతిపాదించే విధంగా వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. గ్రామ సభలు నిర్వహించిన సమయంలో పనుల ప్రతిపాదనలను మొదటి, రెండో, మూడో ప్రాధాన్యాన్ని బట్టి పేర్కొనాలని ప్రజాప్రతినిధులకు అధికారులు సూచించారు. ఈ లెక్కన మొదటి మూడు ప్రాధాన్యతా క్రమంలోని పనులను మాత్రమే మన ప్రణాళిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారన్న మాట. దీంతో గ్రామ సభల్లో ప్రజలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చేసిన సిఫారసులు నివేదికల్లో చోటుదక్కించుకునే విషయంపై అస్పష్టత నెలకొంది.
అంచనా వ్యయం రూ.2,570 కోట్లు
మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లావ్యాప్తంగా 962 గ్రామ పంచాయతీల్లోని 3,461 ఆవాస ప్రాంతాల్లో మూడు పనుల చొప్పున చేసిన ప్రతిపాదనలకు రూ.2,570 కోట్లు అవసరమవుతాయని అధికారులు నిర్ధారించారు. అదే... గ్రామసభల్లో వచ్చిన అన్ని పనులను అప్‌లోడ్ చేస్తే ప్రతిపాదనల అంచనా వ్యయం భారీగా పెరిగేది.
మండల పరిధిలో పది పనులు..
సర్కారు ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు మొదటి ప్రాధాన్యత ఉన్న పనులను గుర్తించారు. ప్రతి మండంలంలో పది పనులను వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేశారు. మిగిలిన పనులను మండల స్థాయిలోనే రిజర్వ్‌లో పెట్టారు.
వ్యయ అంచనా రూ.1,391కోట్లు..
50 మండలాల పరిధిలోని గ్రామాల్లో మండల పరిషత్ ద్వారా చేపట్టే పనులు ప్రతిపాదనలకు రూ.1391 కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. మన మండలం-మన ప్రణాళిక కోసం నిర్వహించిన మండల సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు ప్రతిఒక్కరూ వారి పరిధిలోని గ్రామాల్లో పదుల సంఖ్యకుపైనే అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. సర్కారు ఆదేశాల మేరకు మండలానికి పది చొప్పున పనులను ఆయూ ప్రాంత ఎంపీడీఓలు మన ప్రణాళిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
ఖరారుకాని జిల్లా ప్రణాళిక...
ఇటీవల జరిగిన జిల్లా ప్రణాళిక సమావేశంలో ప్రతి జెడ్పీటీసీ సభ్యుడు 30 పనులను ప్రతిపాదించాలని ఉప ముఖ్యమంత్రి రాజయ్య సూచించారు. ఈ మేరకు ప్రతి జెడ్పీటీసీ సభ్యుడు తన మండల పరిధిలో 30 పనులను ప్రతిపాదించారు. ఇలా.. కుప్పలుతెప్పలుగా ప్రతిపాదనలు వచ్చిపడ్డారుు. జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ సభ్యులు సుమారు 1,557 పనులను గుర్తించారు. వీటికి సుమారుగా రూ.14 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అరుుతే... మన ప్రణాళిక వెబ్‌సైట్‌లో కేవలం 30 పనులు మాత్రమే అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయూన్ని ఉప ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో ప్రతిపాదనలను చైర్‌పర్సన్ క్యాంపు కార్యాలయానికి పంపించాలని, వాటిలో నుంచి 30 పనులను ఖరారు చేయాలని రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ అధికారులకు వారు సూచించారు. ఈ పనుల గుర్తింపు కోసం క్యాంపులో కసరత్తు చేస్తున్న క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం మరో 20 పనులు అప్‌లోడ్ చేసే విధంగా వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించడంతో జిల్లా పరిషత్ అధికారులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఒక్కొక్క పని ప్రతిపాదించే అవకాశం లభించినట్లయింది. ఈ మేరకు జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులను ఫోన్‌లో సంప్రదించి మొదటి ప్రాధాన్యత క్రమంలో ఒక పనిని మాత్రమే సూచించాలని జిల్లా పరిషత్ అధికారులు కోరుతున్నారు. ఇలా.. వచ్చిన ప్రతిపాదనల అంచని వ్యయూన్ని లెక్కించి జిల్లా ప్రణాళికలను ఖరారు చేసేందుకు అధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
పెద్దలకు నో చాన్స్...
జిల్లా ప్రణాళికల్లో భాగంగా తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జిల్లా ప్రణాళికల్లో 50 పనులకు మాత్రమే అవకాశం ఉండడం వల్ల జెడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వాటిని రాష్ట్ర ప్రణాళికల్లో పొందుపరిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.