‘టీకాస్’ సఫలం | the Railway Board examining train protection system | Sakshi
Sakshi News home page

‘టీకాస్’ సఫలం

Published Mon, Nov 24 2014 11:37 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

the Railway Board examining  train protection system

తాండూరు: ఓ ట్రాక్‌లో రైలు ఆగి ఉంది.. అదే ట్రాక్‌లో ఎదురుగా మరో ప్రత్యేక రైలు సుమారు వంద కి.మీ. వేగంతో దూసుకొచ్చింది.. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్న ఇతర అధికారులు, సామాన్య ప్రయాణికులు ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తున్నారు.. ఇంతలోనే ప్రత్యేక రైలు ఇంజిన్‌లోని ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం (ఏటీపీఎస్)తో ఆగి ఉన్న రైలుకు సుమారు 100-150 మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ ప్రయోగానికి తాండూరు రైల్వేస్టేషన్ వేదికైంది.  


సోమవారం రైల్వే బోర్డు సభ్యుడు ఏకే మిట్టల్ (ఎలక్ట్రికల్), బోర్డు అడిషినల్ మెంబర్లు మహేష్‌మంగళ్ (టెలీకమ్యూనికేషన్స్), మనోహరన్ (సిగ్నల్స్)తోపాటు సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఎస్‌కే మిశ్రా, వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ప్రయోగాలను పరిశీలించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వారంతా తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఏటీపీఎస్ (టీకాస్) ప్రయోగాలు చేస్తున్న భారత రైల్వే పరిశోధన సంస్థ (ఆర్‌డీఎస్‌ఓ) అధికారి మన్సుఖనితో కలిసి రైలు ఇంజిన్‌లో తాండూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లారు.

కర్ణాటక రాష్ట్రంలోని కుర్‌గుంట, బషీరాబాద్‌లోని నవాంద్గీ, మంతట్టి రైల్వేస్టేషన్లలో ఎదురెదురుగా, పక్కపక్క ట్రాక్‌ల్లో రైళ్లను నడిపి ఏటీపీఎస్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించారు. దాదాపు మూడు రైల్వేస్టేషన్ పరిధిలోని నాలుగు బ్లాక్ సెక్షన్లలో రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏటీపీఎస్‌లోని 32 ఫీచర్స్‌ను స్టడీ చేశారు.

 డ్రైవర్ చేయలేనిది..
 ప్రత్యేక రైలు వంద కి.మీ. వేగంతో వెళ్తుండగా.. రెడ్‌సిగ్నల్ వేయడంతో డ్రైవర్ రైలు వేగాన్ని నియంత్రించలేకపోయాడు. రైలులో ఉన్న ఏటీపీఎస్ ఆటోమెటిక్‌గా వేగాన్ని నియంత్రించి రైలును సుమారు 100 మీటర్ల దూరంలోనే ఆపేసింది. సిగ్నల్స్, లెవల్‌క్రాసింగ్‌లు తదితర చోట్ల ఏటీపీఎస్ పనితీరును, ఇంజిన్‌లోని డ్రైవర్ ఇంటర్‌పేస్ మానిటర్‌లో సిగ్నల్ ఇండికేషన్స్ తదితర అంశాలను బోర్డు సభ్యులు స్వయంగా గమనించారు.

 ప్రయోగాలు సంతృప్తికరం..
 అనంతరం రైల్వే బోర్డు అదనపు సభ్యుడు మహేష్‌మంగళ్ తాండూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రయోగాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్‌ను మార్చి, జూన్‌లలో అమల్లోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించి రెండు సెక్షన్ల మధ్య టవర్లు, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే సుమారు 28 రైల్వేస్టేషన్లలో టవర్లు, ఇతర పరికరాలను అమర్చడం పూర్తయిందన్నారు. రెండేళ్లుగా చేసిన ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు, మూడు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement