
ఉద్యమ ఫలితమే ఎన్టీపీసీలో ఉద్యోగాలు
ఎన్టీపీసీ ఎస్సీ,ఎస్టీ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఎస్.కుమార్
గోదావరిఖని, న్యూస్‌లైన్: పాతికేళ్ల పోరాటాలతోనే ఎన్టీపీసీలో 21 ఎస్సీ, 12 ఎస్టీ పోస్టులు భర్తీ చేయించామని ఎన్టీపీసీ ఎస్సీ, ఎస్టీ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఎస్.కుమార్, కార్యదర్శి వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడారు. ఎన్టీపీసీ యాజమాన్యం దళిత భూ నిర్వాసితులకు చేసిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టిన వైనాన్ని వివరించారు. రాష్ట్రపతికి సైతం ఈ అన్యాయాన్ని వివరించామని చెప్పారు.
ఉద్యోగాల సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమించామని చెప్పారు. 1977 నుంచి 1991 వరకు జరిగిన నియామకాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 64, ఎస్టీలకు 32 పోస్టులు ఇవ్వాల్సి ఉండగా, ఎస్సీలకు 32 ఇచ్చి, ఎస్టీలను పూర్తిగా విస్మరించారన్నారు.
అదే జనరల్, బీసీలు 388 మందికి 1991లోనే ఉద్యోగాలిచ్చారని, ఇన్నేళ్లలో వారి జీవన స్థితిగతులు మెరుగవగా ఎస్సీ, ఎస్టీ, భూ నిర్వాసితులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి అంశాలతో తాము ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు మొరపెట్టుకోగా 1988లో జరిగిన ఒప్పందంలో మిగిలిన 59 పోస్టులు ఎస్సీ, ఎస్టీలతో భర్తీ చేయాలని ఆదేశించాయని పేర్కొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కొత్త రోస్టర్‌పాయింట్ల ప్రకారం దళితుల 59 ఉద్యోగాల్లోంచి 15 బీసీలకు, 11 జనరల్ అభ్యర్థులకు కేటాయించినా విశాల ద ృక్పథంతో వ్యవహరించామని, 21 ఎస్సీ, 12 ఎస్టీలు తీసుకునేందుకు అంగీకరించిందని చెప్పారు.
ఆ మేరకు ఇటీవల ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఇన్నేళ్ల తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీపీసీ రామగుండం యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఒప్పందంలో మిగిలిన 25 పోస్టులను, కొత్తగా ఏర్పాటయ్యే 8,9 యూనిట్లలో మరిన్ని ఉద్యోగాలు సాధించేందుకు పోరాడుతామని స్పష్టంచేశారు. ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలుంటే సమగ్ర విచారణ జరుపాలని కోరారు. ఈ సాకుతో దళితుల పోస్టులు భర్తీ చేయకుంటే ఊరుకోబోమని స్పష్టంచేశారు.