రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట ! | The two districts border issues | Sakshi
Sakshi News home page

రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట !

Published Mon, Sep 22 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట !

రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట !

ఖమ్మం.. వరంగల్ నడుమ లచ్యాతండా
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గూడెం
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
మౌలిక వసతులు లేక అల్లాడుతున్న గిరిజనులు
ఖమ్మం జిల్లాలో కలపాలని కోరుతున్న స్థానికులు

 
   
 అదో చిన్న తండా. రెండు జిల్లాల సరిహద్దులో ఉంది. సగం ఇళ్లు ఖమ్మం జిల్లా కామెపల్లి మండల పరిధిలో, మిగతా సగం ఇళ్లు డోర్నకల్ మండల పరిధిలో ఉండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.  కనీస వసతులు కొరవడి గిరిజనం తండ్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. డోర్నకల్- లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న లచ్యా తండా పరిస్థితి ఇది.
 
డోర్నకల్ : లచ్యాతండా.. మొత్తం 400మంది జనాభాతో ఖమ్మం.. వరంగల్ జిల్లాల సరిహద్దున ఉన్న ఈ చిన్న తండా రెండుగా చీలిపోయింది. తండా మధ్యనుంచి వెళ్తున్న రహదారికి ఒకవైపున ఉన్న ఇళ్లన్నీ డోర్నకల్ మండల పరిధిలోకి, మరోవైపున ఉన్న ఇళ్లన్నీ ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలోకి వస్తాయి. మొత్తం 80కుటుంబాలు ఉన్న ఈ తండాలో 240మంది ఓటర్లున్నారు. డోర్నకల్-లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటరు దూరంలో ఉన్న లచ్యాతండాలోని సగం ఇళ్లు డోర్నకల్ నాలుగో వార్డు పరిధిలో, అలాగే మూడవ మండల ప్రాదేశిక స్థానం పరిధిలో ఉన్నాయి. డోర్నకల్ మండలకేంద్రం నుంచి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఖమ్మం జిల్లాలోని కామెపల్లి మండలకేంద్రం నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
దశాబ్దాలు గడుస్తున్నా.. నిర్లక్ష్యమే..
 
లచ్యాతండా ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. రెండు జిల్లాల సరిహద్దులో ఉండడంతో ఏ జిల్లా అధికారులూ, ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. తండాలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డుకు ఇరుపక్కల  ఉన్న వాళ్లు గొడవలు పడితే ఇటుపక్క ఉన్నవారు డోర్నకల్‌లో, అటుపక్కన వారు కామెపల్లి మండలం తోడేళ్లగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తండాలోని ఇరుపక్కల ఉన్న చేతిపంపులు పనిచేయడం ఏనాడో మానివేశాయి. తండాలోని ఏకైక వీధిలో కొద్ది దూరం మాత్రం సిమెంటు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వర్షాకాలంలో తండావాసులు అనుభవిస్తున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. చిన్నపాటి వర్షానికే వీధంతా బురదమయమై మోకాలు లోతు వరకు భూమిలోకి కూరుకుపోతుందని తండావాసులు చెబుతున్నారు. తండాలో పాఠశాల లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు పొన్నెకల్లు, మరికొంతమంది డోర్నకల్‌లోని పాఠశాలలకు వెళ్తున్నారు. ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులు తండాను గాలికొదిలేయడంతో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కామెపల్లి మండలం ఏజెన్సీ ప్రాతం కింద ఉన్నందున తండా మొత్తాన్ని  కామెపల్లి మండలం కిందకు మార్చి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
 
తాగునీటి సమస్య తీవ్రం

డోర్నకల్ వైపు ఉన్న లచ్యాతండాలో తాగునీటి సమస్య  తీవ్రంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ బావుల్లోని నీరే ఆధారం. తండాలో వసతుల కల్పన కు అప్పుడప్పుడు అరకొరగా నిధులు కేటాయిస్తున్నా పెద్దగా ఉపయోగపడడం లేదు.
 - తేజావత్ బాలు, లచ్యాతండా, డోర్నకల్ మండలం
 
తాతల కాలం నుంచీ ఇంతే..


మా తాతల కాలం నుంచీ తండా ఇలాగే ఉంది. మా తాత బోల్యా, తండ్రి పంతులు, నేను, నా కొడుకు రవి ఇక్కడే పుట్టాం. సమస్యలతో సర్దుకుపోతున్నాం. రెండు జిల్లాల వాళ్లు మా తండా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.
 - భూక్యా రాములు
 లచ్యాతండా, కామెపల్లి మండలం
 
ఖమ్మంలో కలిపితేనే మేలు

ప్రస్తుతం మేమున్న వైపు తండా ఏజెన్సీ మండలమైన కామెపల్లి పరిధిలో ఉంది. కాబట్టి తండా మొత్తాన్ని కామెపల్లి మండలంలో కలిపితే కొంతమేలు జరిగే అవకాశం ఉంది. నేను డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదు. తండాను కామెపల్లిలో కలిపితే కొందరికైనా మేలు జరుగుతుంది.
 - భూక్యా నరేష్
 లచ్యాతండా, కామెపల్లి మండలం
 
కరెంటు సక్రమంగా ఉండదు

తండాలో ఎప్పుడూ కరెంటు సక్రమంగా ఉండదు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. మారుమూలన ఉన్నందునే మా తండాను ఎవరూ పట్టించుకోవడం లేదు.
 - భూక్యా పద్మ
 లచ్యాతండా, కామెపల్లి మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement