చాంద్రాయణగుట్ట: చాంద్రాయణ గుట్ట పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ మెగా డ్రీమ్ సిటీలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 2.32 కోట్లు విలువైన 80 తులాల బంగారం, రూ.16.26 లక్షల నగదు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... స్థానికంగా నివాసం ఉండే మహ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి తన కుమారుడి వివాహం కోసం 40 తులాల బంగారం, 16 లక్షల నగదు ను ఇంట్లో ఉంచారు. మహ్మద్ అబ్దుల్ మంగళవారం రాత్రి బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లోఉన్న నగదు, విలువైన అభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు.
అదే కాలనీలో నివసించే మహ్మద్ జమాలుద్దీన్ ఇంట్లో 8 తులాల బంగారం, రూ. 6వేల నగదు, ఖరామత్ ఆలీ ఇంట్లో రూ.10 వేల నగదు, గౌస్ ఇంట్లో 15 తులాల బంగారం, రూ.10 వేల నగదు, మరో ఇంట్లో 17 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.