‘ఎనీ డెస్క్‌’తో.. ఎనీ టైమ్‌ లాగేస్తారు! | There are many challenges in the investigation | Sakshi
Sakshi News home page

‘ఎనీ డెస్క్‌’తో.. ఎనీ టైమ్‌ లాగేస్తారు!

Published Mon, Feb 11 2019 3:25 AM | Last Updated on Mon, Feb 11 2019 3:25 AM

There are many challenges in the investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకు అధికారులమంటూ ఖాతాదారుడికి ఫోన్లు చేసి డెబిడ్‌ కార్డు వివరాలతోపాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని సైతం సంగ్రహించి అకౌంట్‌ నుంచి  డబ్బులు దండుకునే జమ్‌తార ఓటీపీ సైబర్‌ నేరగాళ్లు పంథా మార్చి కొత్త దందా షురూ చేశారు. ఓసారి బోల్తాపడ్డ బాధితుడినే పదేపదే టార్గెట్‌ చేస్తున్నారు. ఒకసారి ఓటీపీ చెప్పి భంగపడ్డ బాధితుడు మరోసారి చెప్పేందుకు సాహసించడు. దీంతో మళ్లీమళ్లీ అడగకుండా ఓటీపీని సంగ్రహించేందుకు ఖాతాదారుడికి ఫోన్‌ చేసి ‘ఎనీ డెస్క్‌’అనే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోమని చెబుతున్నారు. ఒక్కో క్రైమ్‌కు ఒక్కో సిమ్‌ వాడుతున్న ఈ నేరగాళ్లు పోలీసుల దర్యాప్తునూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు.  

7 గ్రామాల్లోనూ అదే పని.. 
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ జిల్లా దాటి జార్ఖండ్‌లో ప్రవేశించిన వెంటనే వచ్చేదే జమ్‌తార జిల్లా. ఆ జిల్లాలో ఉన్న 7 గ్రామాల్లోని యువతకు సైబర్‌ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా జరగని ఆ జిల్లా కేంద్రంలో జనరేటర్లకు మంచి డిమాండ్‌ ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్లతో కూర్చునే అక్కడ యువత దేశవ్యాప్తంగా అనేక మందికి కార్డు వివరాలు సహా ఓటీపీ కోసం గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు అనేక ప్రాంతాల్లోని కాల్‌ సెంటర్లలో జమ్‌తార యువత పనిచేసి వచ్చారు. ఈ అనుభవంతో వారే సొంతంగా కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకుని సైబర్‌ నేరాల దందాలోకి దిగారు. ఫోన్లలో ఎదుటివారితో ఎలా మాట్లా డాలి అనే అంశంపై అక్కడ శిక్షణ కూడా ఇస్తుంటారు. బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరగాళ్లు ఉన్నారు. 

బ్యాంకుల నుంచే డేటా.. 
ఆయా బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు వాటి కాల్‌ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్‌ కార్డుల సమాచారం ఈ సైబర్‌ నేరగాళ్లకు చేరుతోంది. బోగస్‌ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డులు తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి బేసిక్‌ మోడల్, తక్కువ ఖరీదున్న సెల్‌ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటా లోని బ్యాంకు కస్టమర్ల ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేస్తుంటారు.  అందరూ తమ ఫోన్లలో ‘ట్రూకాలర్‌’తరహా యాప్స్‌ వాడుతున్నారు. దీంతో బోగస్‌ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న వీళ్లు ముందుగానే తమ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్‌ హెడ్‌–ఆఫీస్‌’పేరుతో రిజిస్టర్‌ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్‌ నుంచి కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచే వస్తున్న భావన కలిగి బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేసేస్తున్నారు.  

పదేపదే అడగకుండా.. 
ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునేలోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. ప్రతి లావాదేవీకీ ఓటీపీ కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే చెప్పకుండా ఉండే ఆస్కారం ఉంది. అందుకే టార్గెట్‌ చేసుకున్న వారిలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్‌ నుంచి ఎనీ డెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటున్నారు. టీమ్‌ వ్యూవర్‌ తరహాకు చెందిన దీనికి ఓ పాస్‌వర్డ్‌ చెప్పి యాక్టివ్‌ చేసుకోమంటున్నారు. ఈ యాప్‌తో భవిష్యత్‌లో బ్యాంకుకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, అప్‌డేట్స్, లింకేజ్‌లు ఆటోమేటిక్‌గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని యాక్టివ్‌ చేయగానే ఖాతాదారుడి ఫోన్‌ స్క్రీన్‌ సైబర్‌ నేరగాడి ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఫలితంగా ఫోన్‌కు వచ్చిన ప్రతి ఓటీపీని అడగాల్సిన పనిలేకుండా ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇదంతా గ్రహించి తెరుకునేలోపే బాధితుల బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. 

దర్యాప్తులో ఎన్నో సవాళ్లు.. 
ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్‌కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ బోగస్‌ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్‌గా పిలిచే వీరి నుంచి సైబర్‌ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్‌ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, సొమ్ము రికవరీ చేయడం అంత కష్టమని అధికారులు చెప్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ చెప్పవచ్చని సూచిస్తున్నారు. ఆధార్‌ లింకేజ్‌ లేదా అప్‌గ్రేడేషన్‌ కోసం బ్యాంకు నుంచి ఎలాంటి యాప్‌లు రావనే విషయాన్ని ప్రతీ ఖాతాదారుడు గుర్తుంచుకోవాలని, అపరిచితులు సూచించే ఎలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement