బ్యాంకు పిన్‌ నెంబరును... కచ్చితంగా మార్చుకోవాలి | Cyber Criminals Cloning Debit And Credit Cards Hyderabad | Sakshi
Sakshi News home page

చిప్‌.. చీట్‌

Published Fri, May 22 2020 8:09 AM | Last Updated on Fri, May 22 2020 9:14 AM

Cyber Criminals Cloning Debit And Credit Cards Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : మాగ్నెటిక్‌ స్ట్రిప్‌తో కూడిన డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల్ని నేరగాళ్లు తేలిగ్గా క్లోనింగ్‌ చేస్తున్నారనే ఉద్దేశంతో బ్యాంకులు చిప్‌తో కూడిన కార్డుల్ని అమలులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు వీటికీ సైబర్‌ క్రిమినల్స్‌ దాడి తప్పట్లేదు. ఈ కార్డుల్నీ క్లోన్‌ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బుధ, గురువారాల్లోనే ఇద్దరు బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఓ గ్రాఫిక్‌ డిజైనర్‌ నుంచి రూ.50 వేలు, సోమాజిగూడకు చెందిన మరో యువకుడి ఖాతా నుంచి రూ.40,500 ఈ రకంగా కాజేశారు. మొదటి కేసులో బీహార్‌లోని గయ, రెండో ఉదంతంలో నెల్లూరులోని ఏటీఎం కేంద్రాల నుంచి నగదు డ్రా అయింది. ఈ కేసులు నమోదు చేసిదర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కార్డు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  

చేతిలో ఇమిడే స్కిమర్మర్లతో తస్కరణ...  
మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని ఖరీదు చేస్తున్న సైబర్‌ నేరగాళ్ళు వివిధ వాణిజ్య సముదాయాల్లో ఉండే తమ అనుచరులకు అప్పగిస్తున్నారు. వీటిని నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్న ఆ అనుచరులు తమ వద్ద షాపింగ్‌కు వచ్చిన వచ్చిన వినియోగదారులు డబ్బు చెల్లింపు కోసం డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ఇచ్చినప్పుడు అదును చూసుకుని ఆ కార్డును ఈ స్కిమ్మర్‌లోనూ ఒకసారి పెట్టి తీస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం వీటిలో నిక్షిప్తమవుతుంది. కస్టమర్‌ టైప్‌ చేసేప్పుడు పిన్‌ నెంబర్‌ను గమనిస్తున్నారు. ఆపై వినియోగదారుడి కార్డును అతడికి తిరిగి ఇచ్చేస్తున్నారు.  

కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేసి...  
క్రెడిట్‌/డెబిట్‌ కార్డుకు సంబంధించిన డేటామొత్తం చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. దుండగుల తమ వద్ద ఉన్న స్కిమ్మర్‌లో కార్డు ఆ వైపునే పెట్టి తీయడంతో డేటా తస్కరణకు గురవుతోంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్ల, తాము గుర్తించిన పిన్‌ నెంబర్లను ఈ అనుచరులు ప్ర«ధాన సూత్రధారులకు అందిస్తుంటారు. వీటిని సైబర్‌ నేరగాళ్ళు తన ల్యాప్‌టాప్‌/కంప్యూటర్లకు కనెక్ట్‌ చేసి వాటిలోకి అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఆపై ఈ డేటాను డార్క్‌ నెట్‌ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. దీన్ని ఖరీదు చేస్తున్న దుండగులు రైటర్లను ఖరీదు చేసి, తమ కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌లకు  అనుసంధానిస్తుంటారు. ఇలాంటి మిషన్లన్నీ అత్యధికం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి.  ఆన్‌లైన్‌లో ఖరీదు చేస్తున్న చిప్‌లతో కూడిన ఖాళీ కార్డులను ఈ ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌లకు కనెక్ట్‌ చేసి ఒక్కో కార్డు డేటాను రైట్‌ చేసి క్లోన్డ్‌ కార్డులు రూపొందించేస్తుంటారు. అంటే మన క్రెడిట్‌కార్డుకి నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట.  

దేశంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లు
ఇలా తయారైన క్లోన్డ్‌ కార్డుల్ని వినియోగించడానికి ఈ నేరగాళ్ళు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. వారికి కార్డులు, పిన్‌ నెంబర్లను పంపిస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు లేని ఏటీఎం కేంద్రాలను గుర్తించే ఈ ఏజెంట్లు డబ్బు డ్రా చేస్తూ ఉంటారు. ఆ మొత్తంలో కొంత కమీషన్‌ మినహాయించుకుని మిగిలింది సూత్రధారులకు అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న స్వైపింగ్‌ మిషన్‌ కలిగిన వారికి అందిస్తూ అక్కడ స్వైపింగ్‌ చేయిస్తాయి. ఇలా తమ ఖాతాల్లో పడిన మొత్తాన్ని స్వైపింగ్‌ మిషన్‌ హోల్డర్లు కొంత కమీషన్‌ తీసుకుంటూ సైబర్‌ నేరగాళ్ళకు అప్పగిస్తుంటారు. ఈ రకంగా మనకు తెలియకుండానే క్లోనింగ్‌ కార్డు ద్వారా మన ఖాతా ఖాళీ అయిపోతుంటుంది.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
క్రెడిట్, డెబిట్‌ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుకవైపు ఉండే సిగ్నేచర్‌ ప్యానల్‌లో సంతకం చేయాలి.
బ్యాంకు అధికారులు పంపిన పిన్‌ నెంబరును అలాగే వాడేయకుండా... కచ్చితంగా మార్చుకోవాలి.
క్రెడిట్‌/డెబిట్‌ కార్డు వెనుక వైపు ఉండే సీవీవీ కోడ్‌లో చివరకు మూడు అంకెలూ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, కార్డు పై నుంచి వాటిని చెరిపేయాలి.
మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డును దుకాణం, వెయిటర్‌ తదితరులకు ఇస్తే... అది తిరిగి మీ చేతికి వచ్చే వరకు దృష్టి మళ్లనీయకండి.
ఇటీవల కోవిడ్‌ భయం నేపథ్యంలో అనేక మంది వ్యాపారులు, ఆయా దుకాణాల్లోని వారు కార్డులు స్వైప్‌ చేసిన తర్వాత పిన్‌ నెంబర్‌ అడిగి వాళ్ళే ఎంటర్‌ చేసుకుంటున్నారు.
కొన్ని పరిíస్థితులు మినహాయిస్తే వీలున్నంత వరకు దీనికి అనుమతి ఇవ్వొద్దని అధికారులుసూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement