
అడ్డగోలు పనులు..
ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు నిర్మాణ పనులు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. లేడీస్ క్లబ్ నుంచి కాన్వెంట్ స్కూల్ వరకు సీసీ రోడ్డు వేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ పనులకు మున్సిపాలిటీ నుంచే కాదు, ఏ శాఖ నుంచీ నిధులు మంజూరు కాలేదు. ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించలేదు. అసలు ప్రతిపాదనలే లేవు.. టెండర్లు పిలువలేదు. మరి ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లులెవరిస్తారు..? అధికారంలో ఉన్నాం కదా.. ఎలాగైనా డ్రా చేసుకోవచ్చనే ధీమాతో అధికార పార్టీ ప్రజాప్రతినిధి, అనుచరులు చేపట్టిన అక్రమ పనులివి.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బరితెగింపు షురువైంది. అధికారంలో ఉన్నాం కదా తమను అడిగే నాథుడెవరుంటారనే ధీమాతో అడ్డగోలు పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, తన నివాసానికి రాకపోకలకు అసౌకర్యం కలుగద్ద నే భావనతో ఓ నేత తన అనుచరులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టా రు. ఈ పనులకు ఎలాంటి మంజూరు లేదు. అంచనాలు.. టెండర్లు.. అ గ్రిమెంట్లు.. ఇలా నిబంధనలన్నింటి నీ తుంగలో తొక్కి పనులు చేపట్టా రు. పట్టణ నడిబొడ్డున రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు కట్టి ఈ పనులు చేస్తున్నారు.
అధికారులంతా మన చెప్పుచేతల్లో ఉండే వారే కదా.. ఎలాగైనా బిల్లులు డ్రా చేసుకోవచ్చనే ధీమాతో ఈ అడ్డగోలు వ్యవహారానికి తెర లేపారు. సాధారణంగా నల్ల కనెక్షన్ పైపు కోసం సామాన్యుడు చి న్నగా రోడ్డును తవ్వితే.. వెంటనే అక్కడ వాలిపోయి నానా హంగామా చేసే మున్సిపల్ అధికారులు.. ఏకంగా పట్టణ నడిబొడ్డున ప్రైవేటు వ్య క్తులు వందల మీటర్ల మున్సిపల్ రోడ్డును తవ్వేసి సీసీ రోడ్డును నిర్మిస్తుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ‘నేతల వ్యవహారం.. మనకెందుకొచ్చిన గొడవ..’ అనుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
రోడ్డు మీద రోడ్డు..
ఈ అడ్డగోలు పనులు జరుగుతున్న ఈ రోడ్డును కొన్ని నెలల క్రితమే మున్సిపల్ అధికారులు రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు. బిల్డింగ్ పీనలైజేషన్ పథకం కింద వచ్చిన నిధులతో సుమారు ఏడు నెలల క్రితమే మెటల్ రోడ్డు వేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే రోడ్డుపై పనులు చేపట్టారు. జిల్లాలో అనేక మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే శివారు కాలనీలకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి. ఈ సమస్యలను పక్కన బెట్టి ఓ నేత తన స్వప్రయోజనం కో సం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
రోడ్డు నిర్మాణానికి నిబంధనలివి..
ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ముందుగా ఆ పనులకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించాలి. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలి. ఈ పనులకు నిధులు మంజూరైతే టెండర్లు నిర్వహించి, కాంట్రాక్టరుతో అగ్రిమెంట్ చేసుకుని వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండానే పనులు జరుగుతుండటం గమనార్హం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారం అనుకుంటే పొరపాటే, సాక్షాత్తు కలెక్టర్‌తోపాటు, వివిధ శాఖల ఉన్నతాధికారుల నివాసాలకు వెళ్లే గాంధీ పార్క్ రోడ్డుతో అనుసంధానం ఉన్న రోడ్డు వ్యవహారమే ఇది. అడ్డగోలుగా చేపట్టిన ఈ అక్రమ పనులకు ఏ నిధుల నుంచి బిల్లులు డ్రా చేస్తారో కొద్ది రోజుల్లోనే తేలనుంది.
ఆ పనుల గురించి మమ్మల్ని అడగొద్దు..
ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న ఈ అడ్డగోలు పనుల విషయమై ‘సాక్షి’ మున్సిపల్ ఇంజనీర్ పి.నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా.. పట్టణంలో కాన్వెంట్ స్కూల్ నుంచి లేడీస్‌క్లబ్ వరకు జరుగుతున్న రోడ్డు పనుల గురించి మమ్మల్ని అడగొద్దు. ఈ రోడ్డు పనులకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఈ పనులు ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలియదు అని పేర్కొన్నారు.