- చంద్రబాబు, పొన్నాల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం..
- ఎంఎస్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బీసీ నేతనే చేస్తామన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సామాజిక తెలంగాణ కోసం పాటుపడతామన్న టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ న్యూశాయంపేటలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చునేందుకు ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇక తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమంటున్న టీఆర్‌ఎస్ నేత వ్యాఖ్యలు సరికావని మంద కృష్ణ అన్నారు.
అలాగే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్లీ గడీల తెలంగాణ వస్తుందన్న మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఎవరిని సీఎంగా చేసినా తన మద్దతు ఉంటుందని తెలిపారు. అలాకాకుండా అగ్రవర్ణాలను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తే నిరసనలు తీవ్రంగా ఉంటాయని, దొరల తెలంగాణను అడ్డుకోవడానికి ఏ వ్యక్తితోనైనా, ఏ శక్తితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామని మంద కృష్ణ స్పష్టం చేశారు.
‘సింహగర్జన’కు ముందే స్పష్టం చేయాలి
ఈనెల 25వ తేదీన హన్మకొండలో ఎంఎస్‌పీ ఆధ్వర్యం లో నిర్వహించనున్న సింహగర్జన సభకు ముందే టీఆర్ ఎస్ అధిష్టానం సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టత ఇవ్వాలని మంద కృష్ణ సూచించారు. లేనిపక్షంలో తాము చేపట్టే నిరసనల రూపాన్ని సభా వేదికపై ప్రకటిస్తామని తెలి పారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు దానిపై మాట్లాడకపోవడాన్ని ఆ పార్టీలోని ఎస్సీ నాయకులు గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఎంఎస్‌పీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ రి యాజ్‌తో పాటు నాయకులు తీగల ప్రదీప్, సూరి, రాం బాబు, లక్కిరెడ్డి సత్యం, మంద కుమార్ పాల్గొన్నారు.
మంద కృష్ణను పరామర్శించిన కృష్ణయ్య
హన్మకొండ చౌర స్తా : ఎంఎస్‌పీ వ్య వస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణ మాదిగను బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సోమవారం పరామర్శించారు. మంద కృష్ణ తల్లి ఇటీవల మృతి చెందిన విష యం విదితమే. ఈ మేరకు హన్మకొండ న్యూశాయంపేటలోని ఆయన స్వగృహంలో కృష్ణయ్య పరామర్శించారు.