హైదరాబాద్: తాళం వేసున్న ఇంట్లో చోరీ చేసి రూ. 5 లక్షలకు పైగా విలువైన సొత్తును ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైటెక్‌సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విశేష్ గోకుల్, భార్య శిల్వా జైస్వాల్ నల్లకుంట తిలక్‌నగర్‌లోని రోహిణి చాంబర్స్ రెండో అంతస్థులో నివాసముంటున్నారు. వీరు శుక్రవారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లో ఉంటున్న శిల్పా జైస్వాల్ తల్లిగారి(సుజాత)ఇంటికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోయారు.
కాగా, శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఆగంతకులు విశేష్ గోకుల్ ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. రెండు బెడ్ రూమ్‌లలో ఉన్న అల్మారాల తలుపులు తెరచి 9.25 తులాల బంగారు ఆభరణాలు, 79 తులాల వెండి వస్తువులతో పాటు ఎల్‌సీడీ టీవీ, ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 10 వేల నగదు తీసుకుని పారిపోయారు. శనివారం ఉదయం పక్క ఫ్లాట్(202)లో నివాసముండే ఎన్‌కే. జెన్ విశేష్ గోకుల్ ఫ్లాట్‌లో చోరీ జరిగినట్టు గుర్తించి వారికి ఫోన్ ద్వారా తెలియజేశారు. విశేష్ దంపతులు వెంటనే తమ నివాసానికి చేరుకుని నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చోరీలో పాల్గొన్న దాదాపు పది మందికి పైగా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.