సిరిసిల్ల/కమలాపూర్/ ముథోల్: వర్షాభావ పరిస్థితులు రైతులను బలవన్మరణాల వైపు నడిపిస్తున్నాయి. వేసిన పంటలు మొలకెత్తకపోవడంతో దిక్కుతోచని స్థితిలో శుక్రవారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చినబోనాల గ్రామానికి చెందిన పత్తి రైతు పడిగె దేవయ్య(60) మూడేళ్లుగా పత్తి పంట వేస్తున్నాడు. పదెకరాల్లో పత్తి పంట వేసేందుకు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపం చెందిన దేవయ్య ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన దాసరి రవీందర్(40) చేనేత కార్మికుడు. కులవృత్తితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు.
అప్పులు తీరే మార్గం కనిపించక శుక్రవారం గ్రామ శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం విఠ్ఠోలి గ్రామానికి చెందిన రైతు ముత్యాలోల్ల పుండలిక్ (42) తనకున్న పన్నెండు ఎకరాల్లో ఎనిమిది ఎకరాలు పత్తి, నాలుగు ఎకరాల్లో సోయా వేయగా, వర్షలు పడక విత్తనాలు మొలకెత్తలేదు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో క్రిమిసంహారక మందు తాగాడు.
ముగ్గురు రైతుల ఆత్మహత్య
Published Sat, Jul 12 2014 1:37 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement