
ఇటిక్యాల (అలంపూర్): దైవ దర్శనానికి వెళ్తూ.. ట్రాక్టర్ బోల్తాపడటంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. మానవపాడు మండలం చిన్నపోతులపాడుకు చెందిన మల్లికార్జున్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రాక్టర్‌పై మంగళవారం గద్వాలలోని జమ్ములమ్మ దేవతను దర్శించుకొనేందుకు సోమవారం రాత్రి బయలుదేరారు.
అయితే మునగాల శివారులో జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ (45), పార్వతమ్మ (39), అయిజ మండలం మేడికొండకు శైలజ (10) అక్కిడికక్కడే దుర్మరణం పాలవగా.. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.