
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక రైళ్లలో పండగ బాదుడు మొదలైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలపైన 30 శాతం అదనపు బాదుడుకు దక్షిణమధ్య రైల్వే తెరలేపింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా రైల్వే సైతం పండగ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రంగంలోకి దిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పలు రైళ్లలో ఫిబ్రవరి చివరి నాటికి కూడా ‘నో రూమ్’ దర్శనమిస్తుండగా చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు 300 దాటిపోయింది.
ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలకు, డిమాండ్‌కు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు 150 వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. నగరం నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖపట్టణం, కాకినాడ, విజయవాడ, నర్సాపూర్, తిరుపతి, బెంగళూరు, టాటానగర్, నాగర్‌సోల్ తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. వీటిలో కొన్ని క్రిస్‌మస్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయగా మరికొన్ని రైళ్లు సంక్రాంతి రద్దీతో పాటు, వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే భక్తుల కోసం కూడా ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లన్నింటిలోనూ రెగ్యులర్ చార్జీలపైన 30 శాతం అదనపు చార్జీలు విధించడం గమనార్హం. రెగ్యులర్ రైళ్లలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సాధారణ చార్జీలపైనే అదనపు రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, అందుకు భిన్నంగా చార్జీలను పెంచేశారు. దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా విధిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ మరో అడుగు ముందుకేసి రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణమధ్య రైల్వే సైతం అదనపు వసూళ్లకు దిగింది.
సామాన్యుడిపై అధిక భారం ....
సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణమే ఎంతో చౌక. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ చార్జీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కేవలం రూ.220 ఉంటుంది. ఆర్టీసీ బస్సులో ఇది రూ.450 వరకు ఉంటే ప్రైవేట్ బస్సుల్లో ఇంకా ఎక్కువే ఉంటుంది. నలుగురు కుటుంబసభ్యులు ట్రైన్‌లో అయితే కేవలం రూ.880 చార్జీలతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్ చార్జీ రూ.385 వరకు ఉంది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లేందుకు రూ.1540 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిందే. ఇక ఏసీల్లో ఈ చార్జీలు ఇంకా ఎక్కువే ఉంటాయి. తక్కువ చార్జీలతో దూర ప్రయాణం చేయవచ్చుననుకొనే ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు భారంగానే మారాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు థర్డ్ ఏసీ రూ.600 వరకు ఉంటే ప్రత్యేక రైళ్లలో ఇది రూ.1085 వరకు పెరిగింది. అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి.
ప్రత్యేక రైళ్లు జీవిత కాలం లేటు...
ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలను అమాంతంగా పెంచేసినప్పటికీ రైళ్ల నిర్వహణ మాత్రం దారుణంగా ఉంటుంది. ప్రత్యేక రైళ్ల నిర్వహణపై అధికారులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 10 నుంచి 20 ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. ఇవి నిర్ణీత సమయం ప్రకారమే ఇక్కడి నుంచి బయలుదేరినప్పటికీ గమ్యానికి చేరుకోవడంలో మాత్రం తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. రెగ్యులర్ రైళ్లకు ఉండే ప్రాధాన్యత ప్రత్యేక రైళ్లకు ఉండడం లేదు. దీంతో ఒక్కో రైలు5 గంటల నుంచి 8 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. ‘ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. రెగ్యులర్ రైళ్లు వెళితే తప్ప ప్రత్యేక రైళ్లకు అనుమతి లభించదు. దీంతో తరచుగా ఆగుతూ, సాగుతూ వెళ్తాయి.’ అని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ప్రత్యేక రైళ్లన్నింటి నెంబర్లు ‘సున్నా’తో మొదవులుతాయి. ఇలా ‘సున్నా’తో మొదలయ్యే రైళ్లనగానే ఒక నిర్లక్ష్యం ఉంటుంది. దీంతో బాగా ఆలస్యంగా నడుస్తాయని’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment