బదిలీ అయినా...రిలీవ్ కాని దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ ఏసీ
నల్లగొండ, న్యూస్‌లైన్: జిల్లా దేవాదాయ శాఖలో ఓ అధికారి బదిలీ ఉత్తర్వులు చేతికందినా, విధుల్లోంచి రిలీవ్ కాలేదు. పైగా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన ఓ అధికారితో సన్నిహితంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటున్నాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.... జిల్లా దేవాదాయ శాఖ ఏసీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ బాధ్యతలను చెర్వుగట్టు దేవస్థానం ఈఓ విజయరామరాజుకు అప్పగించారు. ఈ రెండింటితో పాటు హైదరాబాద్‌లో బాల్గంపేట, సికింద్రాబాద్ వినాయక దేవస్థానాలకు ఇన్‌చార్జ్ వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా నాలుగుచోట్ల విధులు నిర్వర్తిస్తున్నాడు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో బదిలీల్లో భాగంగా ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ దేవాదాయ కమిషనర్ నుంచి ఈ నెల 1వ తేదీన ఉత్తర్వు నెం.బి4/9869/2014-4 జారీ అయింది. వెంటనే విధుల నుంచి తప్పుకుని కమిషనర్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని , జిల్లా ఇన్‌చార్జ్ ఏసీ బాధ్యతలు కార్యాలయ సూపరింటెండెంట్‌కు, చెరుగుట్టు ఈఓ బాధ్యతలు మనోహర్ రెడ్డికి అప్పగించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ దేవస్థానాల బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. అయితే మన జిల్లాలోని రెండు పోస్టుల నుంచి రిలీవ్ కాలేదు. ప్రస్తుతం చెర్వుగట్టు దేవస్థానం వద్ద భవన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పాత ఫైళ్లను క్లియర్ చేసే పనిలో ఉండేందుకు ఇంకా రిలీవ్ కాలేదనే గుసగుసలు దేవస్థానం ఉద్యోగుల నుంచి వినవస్తున్నాయి.
అంతేకాకుండా విజయరామరాజు శుక్రవారం హుజూర్‌నగర్ మండలం బూరగడ్డ వెళ్లి దేవాదాయ భూముల సెటిల్‌మెంట్ వ్యవహారంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు రిటైర్డ్ ఏసీ మధానాచారి కూడా వెళ్లారు. విధుల నుంచి తప్పుకోమని కార్యాలయ అధికారులు కోరినప్పటికి రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.
ఈ విషయమై దేవాదాయ శాఖ సూపరింటెండెండ్ రామచంద్రరావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ బదిలీ ఉత్తర్వులు ఈనెల 1 తేదీన వచ్చాయని, హైదరాబాద్‌లో కూడా రిలీవ్ అయారని చెప్పారు. కార్యాలయ పనుల నిమిత్తం శుక్రవారం బూరుగడ్డ వె ళ్లిన మాట వాస్తవేమనని ఆయన ధృవీకరించారు. రిలీవ్ కావాలని తాము పలుమార్లు కోరినట్లు రామచంద్రరావు తెలిపారు.