త్యాగానికి ప్రతీక బక్రీద్ | today bakrid festival | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక బక్రీద్

Published Mon, Oct 6 2014 2:29 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

త్యాగానికి ప్రతీక బక్రీద్ - Sakshi

త్యాగానికి ప్రతీక బక్రీద్

రాచరికపు మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని చెప్పినందుకు దేశం నుంచి బహిష్కరించినా.. కన్నవారు కాదుపొమ్మన్నా.. ఆయనకు దేవుడిపై అభిమానం సడలలేదు. కనికరించే దేవుడే.. కన్న కొడుకును గుట్టల్లో ఒంటరిగా వదలమన్నా జంకలేదు. కడుపుతీపి కన్నా.. తనకు దైవభ క్తే ముఖ్యమని భావించిన ఆయన ఆఖరికి దేవుడి ఆజ్ఞ మేరకు కొడుకును కూడా బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు. చివరికి అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన భక్తుడిగా ప్రసిద్ధికెక్కి త్యాగాని కి మారుపేరుగా నిలిచారు ఇబ్రాహిం. అందుకే ఆయన త్యాగానికి స్ఫూర్తిగా శతాబ్దాలుగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు.
 
- నేడు ఈద్ ఉల్ అజ్‌హా
- ముస్తాబైన ఈద్గాలు, మసీదులు

పోచమ్మమైదాన్/ హసన్‌పర్తి : ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఈద్-ఉల్ ఫితర్(రంజాన్), రెండోది ఈద్-ఉల్-అజ్‌హా (బక్రీద్) ఒకటి. బక్రీద్ అంటే ’ బకర్- ఈద్’ అంటే జంతువును బలిచ్చే పండుగ. అందుకే దీనినే ఈద్-ఉల్-ఖుర్బానీ అని కూడా పిలుస్తారు. ఖుర్బానీ అంటే దేవుడి పేరుతో పేదవారికి జంతువు మాంసాన్ని దానం చేయడం.
 
చరిత్ర చెబుతున్నదేంటంటే..
పూర్వం ఇరాక్ దేశ  ప్రజలు విగ్రహారాధన కు ప్రాధాన్యతనిచ్చేవారు. ఈ దేశంలో నివసించే ఇబ్రాహిం తండ్రి విగ్రహాలను తయారు చేసేవాడు. ఇది నచ్చని ఇబ్రాహిం తన తండ్రి ని ‘మనం ఎందుకు విగ్రహాలను ఎందుకు పూజించాలి’అని ప్రశ్నిస్తాడు. ఇది వంశపారంపర్యంగా వస్తోందని ఆయన సమాధానం ఇవ్వడంతో సంతృప్తి చెందని ఆయన ప్రజల్లో దైవ భక్తి పెంపొందించి, విగ్రహారాధన తొలగించేందుకు సిద్ధమవుతాడు. అనంతరం అల్లాహ్‌ను ప్రార్థించాలని దేశంలో ప్రచారం చేపడతాడు. ఇది గిట్టని ఆ దేశ రాజు నమ్రూద్ ఇబ్రాహింకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు.

ఈ నేపథ్యంలో ఇబ్రాహిం తన భా ర్యతో కలిసి దైవ ప్రచారం చేసుకుంటూ మక్కా నగరానికి చేరుకుంటాడు. తన తదనంతరం దైవ కార్యభారాన్ని నిర్వర్తించేందుకు సంతానం ఉంటే బాగుంటుందని వారు అల్లాహ్‌ను నమాజ్‌లో వేడుకుంటారు. వారి ప్రార్థనలకు మెచ్చిన అల్లాహ్ పండంటి మగబిడ్డను ప్రసాదిస్తాడు. కొద్ది రోజుల తర్వాత దైవంపై ఉన్న నమ్మకాన్ని పరీక్షించేందుకు వారికి పుట్టిన కొడుకు ఇస్మాయిల్‌ను జనసంచారం లేని ప్రదేశంలో వదిలిరావాలని ఇబ్రాహింను అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. దైవ ఆజ్ఞను పాటించిన ఇబ్రాహిం భార్య, కుమారుడిని జనసంచారం లేని గుట్టల నడుమ వదిలేస్తాడు.

‘ఇక్కడ మమ్మల్ని ఎందుకు వదిలారని అతడి భార్య ప్రశ్నించగా, ఇది దేవుడి ఆజ్ఞ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత ఇస్మాయిల్ నీటి కోసం ఏడుస్తుండడంతో అతడి తల్లి హాజ్‌రా నీటిని తెచ్చేందుకు సఫా, మర్‌వా అనే రెండు గుట్టలను ఏడు సార్లు ఎక్కి నీళ్ల కోసం వెతుకుతుంది. దాహాన్ని తట్టుకోలేని ఆ బాలుడు కాళ్లతో భూమిపై తన్నడంతో నీటి ఊట ఉద్భవిస్తుంది. ఆ నీటినే ‘జమ్..జమ్’ పేరుతో నేడు పిలుస్తున్నారు. ఈ ప్రాంతమే నేటికీ మక్కా నగరంగా రూపాంతరం చెందింది.  
 
ఖుర్బానీ ఎందుకు ఇవ్వాలంటే..
ప్రతీ మనిషి తన ప్రాణ రక్షణ కోసం ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. దైవాజ్ఞ మేరకు ఇస్మాయిల్‌ను బలి ఇచ్చే స్థానంలో గొర్రె పోతు ప్రత్యక్షమై ఆయన ప్రాణాలు రక్షించినందున, ఖుర్బానీ ఇస్తే ప్రాణాలు, ఆస్తులు రక్షించబడుతాయని ఖురాన్‌లో ఉంది. దీంతో ఏటా బక్రీద్  పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఖుర్బానీ (బలి) ఇస్తారు. గొర్రె, మేకను బలి ఇవ్వాలంటే ఒక వ్యక్తి పేరున ఇవ్వాలి. ఆవు, ఒంటెను ఇవ్వాలనుకుంటే ఏడుగురు కలిసి ఖుర్బానీ ఇవ్వవచ్చని పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారు.
 
హజ్ యాత్ర  ఎవరు చేయాలంటే..
ప్రపంచంలోని ఏ దేశంలో ఉండే ముస్లిం అయినా ఎలాంటి అప్పు లేకుండా రూ. లక్ష రూపాయలు నిల్వ ఉన్న ప్రతీ వ్యక్తి హజ్ చేయాలని ముస్లిం మతపెద్దలు చెబుతుంటారు. హజ్ యాత్రతో పూర్వం చేసిన పాపాలు తొలిగి  తల్లిగర్భం నుంచి జన్మించిన శిశువులా కడిగిన ముత్యంలా ఉంటాడని ఖురాన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఏటా లక్షల సంఖ్యలో ముస్లింలు మక్కా, మదీనాను సందర్శించి తమ పాపాలను నుంచి విముక్తి పొందుతారు.
 
దేవుడిచ్చిన గొర్రె..
అల్లాకు ప్రియమైన భక్తుడు ఇబ్రాహిం అలైహీసలాం. ఇతడి భక్తిని పరీక్షించేందుకు అల్లాహ్ ఎన్ని పరీక్షలు పెట్టినా అన్నింటిలో తన దైవ భక్తిని చాటుకుంటాడు. ఒక రోజు ఇబ్రాహీం భక్తిని పరీక్షించిదలచిన అల్లాహ్.. ఇబ్రహీం కలలో కనిపించి.. ‘నీ కుమారుడు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వాలని’ ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇబ్రహీం వెనుకాడకుండా కొడుకు, భార్యను తీసుకుని ఓ నిర్జీవ ప్రదేశానికి బయలుదేరుతాడు. మార్గమధ్యలో భార్య ఎక్కడి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా... ఇది దైవాజ్ఞ అని చెప్పడంతో ఆమె అతడి వెంట నడుస్తుంది. అయితే ఇబ్రహీంను ఎలాగోలా దేవుడి మార్గం నుంచి తప్పించాలని భావించిన ‘సైతాన్’ నీవు చేయబోతున్న పని మంచిది కాదని, దేవుడు కలలో వచ్చి కొడుకును బలి ఇవ్వమంటే ఇస్తావా..? ఇది న్యాయం కాదు.

నీవు చేసే పని తప్పు అని ఆయనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. అయినా, సైతాన్ మాటలు లెక్కచేయని ఇబ్రాహిం దైవకార్యం పూర్తి చేసేందుకు ముందుకు సాగుతాడు. నిర్జీవ ప్రదేశానికి వెళ్లిన తర్వాత కొడుకును బలిచ్చేందుకు సిద్ధమవుతాడు. అయితే తన తండ్రి దైవం కోసం చేసే పనిలో కొడుకుపై మమకారం చూపితే అల్లాహ్‌కు ఆగ్రహం వస్తుందని భావించిన ఇస్మాయిల్ తండ్రిని కళ్లకు గంతలు క ట్టుకోమని సూచిస్తాడు.

కుమారుడు చెప్పినట్టుగా ఇబ్రాహిం తన కళ్లకు గంతలు కట్టుకుని కత్తితో కుమారుడి గొంతు కోసేందుకు సిద్ధమవుతాడు. ఇబ్రాహిం భక్తికి చలించిపోయిన అల్లాహ్ ఇస్మాయిల్ స్థానంలో దుంబ (గొర్రె పోతు)ను ప్రవేశపెట్టడంతో ఇబ్రాహిం దానిని జుబాహ్ (కోయడం) చేస్తాడు. కళ్లకు కట్టిన గుడ్డను విప్పి చూడగా గొర్రె చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి ప్రతీ బక్రీద్ పండుగకు జంతువులను ఖుర్బానీ (బలి) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
 
 
కరువులేని దేశం మక్కా..
క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇబ్రాహిం తన కొడుకు ఇస్మాయిల్‌తో కలిసి కాబాను నిర్మించారు. అనంతరం ఇక్కడ ఉండే ప్రజలు, ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా చూడాలని వారు అల్లాహ్‌ను ప్రార్థించారు. అంతేకాకుండా ఇక్కడి ప్రజలు కూడా సుఖ శాంతులతో, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా జీవించేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నివ సించే, బతుకుదెరువు కోసం వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తారని ప్రజల విశ్వాసం.
 
ముస్తాబైన ఈద్గాలు..
బక్రీద్ (ఈద్-ఉల్ అజ్‌హా) పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. నమాజ్ కోసం ఈద్గాలు, మసీదు లు ముస్తాబయ్యాయి. ఉదయం 8 నుంచి 9 గంటలలోపు నమాజ్ చేసి ఖుర్బానీ  కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement